టీజీవీ ఆల్కాలీస్‌లో గ్యాస్ లీక్!
సాక్షి, టాస్క్‌ఫోర్సు: టీజీవీ గ్రూపునకు చెందిన రాయలసీమ అల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై అంతటా గోప్యత పాటిస్తున్నారు. ప్రమాద వివరాలు చెప్పేందుకు అటు జిల్లా యంత్రాంగంగానీ, యాజమాన్యంకానీ ముందుకు రావడంలేదు. అంతేకాదు అస్వస్థతకు గురైన వారి వివరాలు తెలియనీయకుండా పెట్టడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల సమీపంలోని టీజీవీ గ్రూపు అల్కాలీస్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ పైపును శుభ్రం చేస్తుండగా దానిపై ఇటుకలు పడడంతో పైపు పగిలినట్లు సమాచారం. దీంతో క్లోరిన్ వాయువు రూపంలో అలుముకోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు, సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడే ప్రథమ చికిత్స చేయగా ఐదుగురు కోలుకోవడంతో మిగతా వారిని నగరంలోని గౌరీ గోపాల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందులో సోమవారం రాత్రే కొందరు కోలుకోగా.. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గొందిపర్ల, ఈ.తాండ్రపాడుపై ప్రభావం
ఆల్కాలీస్ ఫ్యాక్టరీకి గొందిపర్ల, ఈ. తాండ్రపాడులు అతి సమీపంగా ఉంటారు. ఫ్యాక్టరీ, ఆ గ్రామాలకు మధ్య 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లోరిన్ వాయువు గ్రామాలను చుట్టమట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో దాదాపు 10 మంది శ్వాస తప్పి పడిపోయినట్లు సమాచారం. వారిలో ముగ్గురిని గ్రామస్తులు రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు సమాచారం.
క్లోరిన్ గ్యాస్ పైప్‌పై
ఇటుకలు పడటంతో ప్రమాదం
పలువురికి అస్వస్థత..
గౌరీ గోపాల్‌కు తరలింపు
గోప్యత పాటిస్తున్న అధికార
యంత్రాంగం, యాజమాన్యం


