ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): టీజీవీ గ్రూప్‌నకు చెందిన శ్రీ రాయలసీమ అల్యూమినియం అండ్ అలయన్స్ కెమికల్స్ పరిశ్రమలో గ్యాస్ లీకు ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పీఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వై.నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైప్ లీకై క్లోరిన్ విడుదల కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారి వివరాలను యాజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కార్మిక, కర్షక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ పనులు జరుగుతుండగా గ్యాస్ లీకై ందని, ఆ వాసనను పీల్చడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారికి ఎక్కడ చికిత్స చేయిస్తున్నారో యాజమాన్యం చెప్పడం లేదన్నారు. మరోవైపు గొందిపర్ల వాసులు కూడా క్లోరిన్ వాయువు వాసన పీల్చడంతో కళ్లలో మంటలు, శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడ్డారని, వారిని ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు రహస్యంగా తరలించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి అంబులెన్స్‌లో రోగులను తీసుకెళ్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఈ ప్రమాద సంఘటనపై కలెక్టర్, ఇత ర అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు.


