శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆన్‌లైన్ నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో స్వచ్ఛంద సేవకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో దేవస్థానంలో శివసేవ బృందాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ స్వచ్ఛంద సేవకు సంబంధించి పలు సూచనలు చేశారు. శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో బృందాలుగా, లేక వ్యక్తిగతంగా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. శివసేవకులు సేవను నిర్వహించే సమయంలో దేవస్థానమే తాత్కాలికంగా గుర్తింపుకార్డులను, దేవస్థానం అధికారిక చిహ్నం(లోగో)తో స్కార్ప్‌ను అందజేస్తుందన్నారు. శివసేవకులకు అవగాహన కార్యక్రమంతో పాటు దేవస్థానం కరదీపికను అందజేస్తుందన్నారు. సమావేశంలో శివసేవకుల విభాగపు ఏఈవో కె.వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు టి.హిమబిందు పాల్గొన్నారు.


