విఖ్యాత్‌రెడ్డి మెంబర్ షిప్ రద్దు : త్రిసభ్య కమిటీ సభ
విజయడెయిరీలో రుణం తీసుకొని చెల్లించకుండా భూమా విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్ అయ్యారని, యూనియన్‌కు తిరిగి డబ్బులు చెల్లించనందుకే చక్రవర్తుల పల్లె పాల సొసైటీ మెంబర్ షిప్ రద్దు అయ్యిందని త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. అక్రమ మార్గంలో ముత్యాలపాడు సొసైటీ నుంచి అధ్యక్షుడినంటూ డెయిరీ వద్ద హంగామా చేయడం అలవాటుగా మారిందన్నారు. ఆయన ఎక్కడా పోటీ చేసేందుకు అర్హత లేదని చెప్పారు. డెయిరీ నియమ నిబంధనలు పాటిస్తూ ముత్యాలపాడు పాలక మండలి సభ్యులు సహకరిస్తే సమస్య సావధానంగా పరిష్కారం చూపుతామన్నారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. భూమా విఖ్యాత్‌రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. ఆ కారణంతోనే పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తుల పల్లెలో విఖ్యాత్ మెంబర్ షిప్‌ను 25–12–2024లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయి న విఖ్యాత్‌కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. మోసపూరిత సభ్యత్వం, సభ్యుల బాధ్యతా ఉల్లంఘన, అర్హత లేకుండా డైరెక్టర్‌గా విఖ్యాత్‌ను కో ఆప్షన్ చేయడం అధ్యక్ష పదవికి అక్రమంగా ఎన్నుకోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.


