ప్రతి అర్జీకి స్పష్టమైన పరిష్కారం చూపాలి
నంద్యాల: ప్రజా సమస్యలను సీరియస్‌గా పరిగణించి ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఇత ర అధికారులు జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదే విధంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి 255 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేను సచివాలయ సిబ్బంది జనవరి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక్కో సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 కుటుంబాల సర్వే పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించి, ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమానికి 139 అర్జీలు అందాయని, వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


