గట్టెక్కని లైనింగ్ పనులు!
జీరో గేటు సమీపంలో కోతకు గురైన కరకట్ట
నిలిచిపోయిన కాంక్రీట్ పనులు
పాణ్యం: జీఎన్‌ఎస్‌ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి)లో పెండింగ్ పనులు అలాగే ఉండిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వ జీరో నుంచి అవుకు టన్నెల్ వరకు 57.7 కిలోమీటర్ల దూరానికి లైనింగ్ చేసేందుకు టన్నల్ మినహాయించి దాదాపుగా రూ. 650 కోట్ల నిధులను విడుదల చేసింది. అప్పట్లో జీరో నుంచి బనగానపల్లె వరకు దాదాపుగా 70 శాతంపైగా లైనింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తట్టెడు మట్టిని వేయలేదు. సీమకు తలమానికంగా ఉన్న గాలేరు– నగరి కాల్వ లైనింగ్ పనులు పూర్తి అయితే 30వేల క్యూసెక్కుల వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. ఇందుకు లైనింగ్ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం గాలేరు ప్రారంభమయ్యే జీరో రెగ్యులేటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేయలేదు. ఫలితంగా కరకట్ట కోతకు గురవుతోంది. కాల్వలకు 20వేల క్యూసెక్కుల నీరు వదలడంతోనే ఈ ప్రవాహానికి లైనింగ్ లేని కారణంగా అటు ఇటు కరకట్ట కోతకు గురై మరింత విస్తరిస్తుంది. దీంతో కట్టపై వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వలో అటు, ఇటు లైనింగ్ పనులతో పాటు కాంక్రీట్ వాల్ పనులు కూడా నిలిచిపోయాయి. అధికారులు పరిశీలించిన త్వరగా లైనింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
గట్టెక్కని లైనింగ్ పనులు!


