ఇక ఒకే మాట.. ఒకే బాట
● ప్రత్యేకంగా సమావేశమైన
చల్లా కుటుంబ సభ్యులు
● చల్లా విఘ్నేశ్వరరెడ్డికి కుటుంబ,
రాజకీయ బాధ్యతలు అప్పగింత
అవుకు(కొలిమిగుండ్ల): దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు, కుటుంబ సభ్యులు ఒకే మాట..ఒకటే బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం అవుకు పట్టణంలోని చల్లా ప్రజాభవన్‌లో చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చల్లా సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రామేశ్వరరెడ్డితో పాటు కుమారుడు వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చల్లా చరణ్‌రెడ్డి, చల్లా విక్రాంత్‌రెడ్డిలు కలిసి ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుటుంబ, రాజకీయ బాధ్యతలను అందరూ కలిసి చల్లా విఘ్నేశ్వరరెడ్డికి అప్పగించారు. ఇకపై చల్లా ఫ్యామీలీ అంతా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని విఘ్నేశ్వరరెడ్డి వివరించారు. కలిసి మెలిసి భవిష్యత్ అంతా ప్రయాణం చేస్తామన్నారు. బహు నాయకత్వం లేకుండా ఒకే నాయకత్వం ఉంటుందన్నారు. తమ కుటుంబ పెద్దలు అంతా ఏకమై సారథ్య బాధ్యతలు తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఏ కార్యక్రమం అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దలతో చర్చించుకొని భవిష్యత్‌లో ముందుకెళ్తామన్నారు. తమ కుటుంబం వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ అండగా నిలబడుతామని భరోసా ఇచ్చారు.


