ఏడాదిన్నరకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● యంబాయి గ్రామస్తులు టీడీపీ నుంచి
వైఎస్సార్‌సీపీలో చేరిక
బేతంచెర్ల: టీడీపీ ప్రభుత్వంపై ఏడాదిన్నర గడవక ముందే ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండలపరిధిలోని యంబాయి గ్రామ సర్పంచ్ యుగంధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ భోగేశ్వరప్ప ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొక్కల రామకృష్ణ, నాగన్న, మాబు, చిన్న కిట్టు, తిరుపాలుతో పాటు మరికొందరు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి బుగ్గన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం కింద నీటిని తీసుకొచ్చి ఎన్నికలకు ముందే బేతంచెర్ల మండలానికి తాగునీరు అందించామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 3 నెలల్లో పనులు పూర్తయి బేతంచెర్లతో పాటు డోన్, ప్యాపిలి మండలాలకు తాగునీరు అందేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా వాటర్ గ్రిడ్ పథకం పనులు డోన్, ప్యాపిలి మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయన్నారు. రూ.36 కోట్లతో నిర్మించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కూర్చోవడానికి బల్లలు, పడుకోవడానికి మంచం, ఉపాధ్యాయులకు కుర్చీలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 90 శాతం పూర్తయిన ప్రభుత్వ భవనాలను మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం లేదంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. యంబా యి గ్రామానికి గతంలో ప్రారంభించిన రహదారి నిర్మాణ పనులు నేటి వరకు చేపట్టకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. డోన్ నియోజకవర్గంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు, అభివృద్ధి పనుల వల్ల భూముల విలువ 3 రెట్లు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రజలు గత వైఎస్సార్‌సీసీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గ్రామ గ్రామాన టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్ రెడ్డి, గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


