తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా!
● మహిళా టీడీపీ కార్యకర్తపై
నోరు పారేసుకున్న టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా’ అంటూ నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఓ మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని ఏ. కోడూరులో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో పాటు ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త భారతి ఎమ్మెల్యేతో తన గోడు వినిపించేందుకు ప్రయత్నం చేసింది. ఒక్కగానొక్క మనవడు గుండె సమస్యతో బాధపడుతుంటే మీరు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తన కుమారుడు వచ్చి గుండె ఆపరేషన్ కోసం డబ్బులు లేక సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆ పేపర్లు కూడా ముట్టుకోలేదని వాపోయింది. తన ఇంటిపైన నిలబడి టీడీపీ జెండా కట్టించానని, ఇంత చేస్తే మీరు ఏమి చేశారని నిలదీసింది. ఇందుకు ఎమ్మెల్యే గట్టిగా నోరు చేసుకుంటూ 50 మందిలో ఓ ఎమ్మెల్యేను నిలదీస్తే గొప్ప అనుకుంటున్నావా, నన్ను ఎవరనుకుంటున్నావు, ఏంది నీ కమాండింగ్.. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పక్కనున్న నాయకులు ఆమెకు సర్దిచెప్పబోగా టీడీపీ జెండా కట్టిన నాకు ఆ బాధ తెలుస్తుందని, మీరేంది అడ్డుకునేదని చెప్పడంతో అక్కడ రసాభాస చోటు చేసుకుంది. సాయం కోసం వస్తే మీ ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వరని చెప్పగా, నేను ఎప్పుడూ అలా చేయలేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కొడుకు సాయం కోసమే మీ ఇంటికి వచ్చాడని, అప్పుడేం చేశారని.. మీ వల్లే తన మనవడు చనిపోయాడని ఆరోపించింది. ఇంతలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా.. అనడంతో అక్కడున్న అధికారులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె కూడా అదేస్థాయిలో ఏం చంపుతావా అని గట్టిగానే సమాధానమివ్వడం గమనార్హం. ఇటీవల ఓ ఫారెస్టు అధికారిపైన చేయి చేసుకోవడం, ఇప్పుడు తమ పార్టీకే చెందిన మహిళా కార్యకర్తపై నోరు పారేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా, తమ బాధలు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీ తరహాలోనే టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటం గమనార్హం.


