శ్రీగిరి.. ఓంకార ఝరి
● శ్రీశైల మల్లన్నకు
వైభవంగా వార్షిక ఆరుద్రోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఓంకార నాదంతో ప్రతిధ్వనించింది. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం మల్లికార్జున స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన పూజలు జరిపారు. శనివారం వేకువజామున స్వామివార్ల ప్రాతఃకాల పూజల అనంతరం నందివాహనసేవ, గ్రామోత్సవం నిర్వహించారు
క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం
ఆరుద్రోత్సవంలో భాగంగా శనివారం వేకువజామున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా అధిష్టింపచేశారు. ప్రత్యేక పూజలు అనంతరం శివాజీగోపుర ద్వార మండపంలో ఉత్తరముఖంగా కొలువుంచారు. భక్తులకు ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, స్థానాచార్యులు ఎం.పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ, ఆలయ పర్యవేక్షకులు, సీఎస్‌వో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


