రమణీయం.. రథోత్సవం
కోసిగి: ఆర్లబండ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం అంబా భవాని మహా రథోత్సవం వేలాది మంది భక్తుల మధ్య వైభవంగా సాగింది. శనివారం మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని వేకువ జామున నుంచి ఆలయ పీఠాధిపతులు శ్రీ మర్రిస్వాముల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ఆకుపూజ, ఫలపుష్పాలు సమర్పించి వెండి కవచ అలంకరణ గావించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సంప్రదాయబద్ధంగా గ్రామంలోని మేటి గౌళ్ల ఇంటి నుంచి పూర్ణకుంభాన్ని మేళతాళాలు, డప్పువాయిద్యాలు, కలశాలతో ఊరేగింపుగా ఆలయం చెంతకు చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి అక్కడి నుంచి పీఠాధిపతులు శ్రీ మర్రిస్వామి, ఆయన కుమారుడు శ్రీ కృష్ణస్వాములు పూలమాన్పుల మధ్య ఊరేగింపుగా రథశాల వరకు చేరుకున్నారు. అక్కడ రథానికి పూజలు చేసి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చారు. భక్తుల మధ్య మహా రథోత్సవంను అమ్మ వారిని పాదాల చెంత వరకు లాగి తిరిగి యఽథస్థానానికి చేర్చారు. భక్తులు రథోత్సవంలో అరటి పళ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు.


