రోడ్డ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పాణ్యం: మండల పరిధిలోని కొణిదేడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సోడం చిన్న వెంకటసుబ్బారెడ్డి(64)ఎక్స్‌ఎల్ వాహనంపై శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. అక్కడి నుంచి మరో పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆలమూరుకు చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్న వెంకటసుబ్బారెడ్డి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య తులశమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
వ్యక్తి ఆత్మహత్య
పాములపాడు: తుమ్మలూరు గ్రామపంచా యతీ మజరా కృష్ణారావు పేట గ్రామంలో మహేష్ (35) ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ తిరుపాలు తెలి పిన వివరాల మేరకు.. మహేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నెలరోజుల క్రితం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లి లక్ష్మీదేవి బోరున విలపించింది. మృతునికి భార్య మమత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
కర్నూలు: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ భావించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా న్యా య సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు శుక్రవారం కర్నూలు న్యాయ సేవా సదన్ నందు పొల్యూషన్, ఎన్‌జీఓ (స్వచ్ఛంద సంఘాలు)లతో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోని దుర్భర వర్గాల్లో పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యతను పెంపొందించడానికి ఎన్‌జీఓస్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కార్మికులకు స్వచ్ఛంద సమాజ అవగాహన కల్పించాలన్నారు. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, పరిశ్రమల్లో వ్యర్థాల దుర్వినియోగం వంటి వాటిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్‌జీఓస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో పాల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ ఇంజినీర్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ ఇంజనీర్ పీవీ కిషోర్ రెడ్డి, అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీర్ వెంకటసాయి కిషోర్, అనలిస్ట్ ఇమ్రాన్, రామకృష్ణ, పవన్, ఎన్‌జీఓ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం, న్యాయవాది బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


