రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు: రహదారి భద్రత–ప్రాణరక్ష, సురక్షితంగా ప్రయాణించండి... క్షేమంగా ఇంటికి చేరుకోండి... (సడక్ సురక్ష–జీవన్ రక్ష) అనే ప్రచార సందేశంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్‌హెచ్–40 కారిడార్)లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను శుక్రవారం ప్రారంభించింది. రహదారి భద్రత, ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జనవరి నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది. రహదారి వినియోగదారులలో అవగాహన కల్పించడం, ప్రమాదాల సంఖ్య తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, కార్లు, భారీ వాహనాల డ్రైవర్లతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టోల్ ప్లాజాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, సమీప గ్రామాల్లో అవగాహన పోస్టర్లు, నినాదాలు క్షేత్రస్థాయి చర్చల ద్వారా ప్రజలను చైతన్యపరచనున్నారు.
అవగాహన కల్పించే ప్రధానాంశాలు...
● ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి.
● అతివేగం, మద్యం సేవించి వాహనం నడపకూడదు.
● పాదచారులు రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్, ఫుటోవర్ బ్రిడ్జిలను (ఎఫ్‌ఓబీఎస్)మాత్రమే ఉపయోగించాలి.
● డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి.
● వాహనాలను కేవలం నిర్దేశించిన పార్కింగ్ స్థ లాలు, ట్రక్–లే–బైస్ వద్ద మాత్రమే నిలపాలి.
● అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నంబర్ 1033, ప్రాజెక్టు కంట్రోల్ రూమ్ నంబర్ 7036500054 ద్వారా సేవలను ఉపయోగించుకోవచ్చు.


