ట్రావెల్స్ బస్సు బోల్తా
● ప్రమాదంలో ఐదుగురికి గాయాలు ● నెల్లూరు నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ప్రమాదం
నంద్యాల(అర్బన్): కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల మండలం చాబోలు మెట్ట వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నెల్లూరు నుంచి గురువారం రాత్రి 11.30 గంటలకు వేగ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆరుగురు ప్రయాణికులతో కర్నూలుకు బయలుదేరింది. మార్గమధ్యలో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నంద్యాల మండలం చాబోలు మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కర్ణాటక రాష్ట్రం తుమ్ముకూరుకు చెందిన మంజన్న, నెల్లూరుకు చెందిన పుష్ప, సుభద్ర, వేణుతో పాటు హ్యూమన్ రైట్స్ ఈసీగా జాయిన్ అయ్యేందుకు వస్తున్న నెల్లూరుకు చెందిన బీఎన్ కుమార్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. హైవేలో బస్సు ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
ప్రయాణికులు తక్కువగా ఉన్నారని పాత బస్సు..
ట్రావెల్స్ యజమాన్యం కండీషన్‌లో ఉన్న బస్సు నడపాల్సి ఉండగా ప్రయాణికులు తక్కువగా ఉన్నారని పాత బస్సును పంపినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి బస్సు వేశారంటూ .. ప్రయా ణంలోనే ప్రయాణికులు డ్రైవర్, క్లీనర్‌తో గొడవ పడినట్లు సమాచారం. బస్సు ఊగుతూ వస్తున్న సమాచారాన్ని డ్రైవర్‌కు చెప్పినా పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. వేగాన్ని నియంత్రించేందుకు చాబోలు మెట్ట వద్ద హైవే అధికారులు ఏర్పాటు చేసిన నియంత్రణ బారికేడ్లను తప్పించబోయి ప్రమాదం జరిగి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ప్రమాదంలో గాయాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుంటున్నారు.


