ప్రమీల ఆచూకీ ఎక్కడ?
9 నెలలుగా కనిపించని
చాగలమర్రి: ముత్యాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న 4వ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త మద్దూరు ప్రమీల (50) ఆచూకీ 9 నెలలుగా తెలియడం లేదు. ఆమె ఆచూకీపై గ్రామస్తులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2025 మార్చి నెలలో అనారోగ్యంతో సెలవుపై వెళ్లినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుశీల తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె విధులకు హాజరు కాలేదు. ఆమెకు ఒక్కగానొక్క కుమార్తె ఉండగా పెళ్లి అయిన తర్వాత మృతి చెందింది. హైదరాబాద్‌లో మనవడు ఉన్నట్లు సమాచారం. గ్రామంలో ఆమెకు సంబంధించి బంధువులు ఎవరూ లేరు. ఆమె ప్రమాదవశాత్తు కింద పడి గాయపడడంతో అనారోగ్యానికి గురైంది. గాయపడిన ఆమెను చికిత్స కోసం గ్రామస్తులు కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె కోలుకోలేక అక్కడే మృతి చెందిందని కొందరు, కాదు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆమె మనవడు హైదరాబాదుకు తీసుకెళ్లాడని గ్రామంలో చర్చ జరుగుతోంది. మరికొంత మంది ఆమె ను నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సూపర్‌వైజర్ సుశీల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విచారించగా అక్కడ ప్రమీల అను పేరుతో ఎవరూ చికిత్స పొందలేదని, గ్రామంలో ఆమె జాడ లేదని నివేదికను సీడీపీఓకు తేజేశ్వరికి అందజేశారు. 20 రోజుల క్రితం ఐసీడీఎస్ అధికారులు విచారణ పేరుతో ప్రమీల అధికారక చిరునామాకు నోటీసులు పంపగా వెనక్కు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఆచూకీపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఏదేమైనా ప్రమీలా ఆచూకీని గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్త


