పడిపోయిన మిర్చి ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు దేవనూరు డీలక్స్, ఆర్మూర్, సూపర్–10, బాడిగ, తేజా, మిర్చి–5 రకాలు వస్తున్నాయి. క్వింటాకు కనీసం రూ.20 వేల ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. కర్నూలు మార్కెట్‌లో మిర్చి–5 రకానికి రూ.16,379 ధర లభించింది. తేజా రకానికి రూ.13,689, ఆర్మూర్ రకం రూ.11,901 పలికింది. ఈ ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● మార్కెట్‌కు ఉల్లి రావడం పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారం 38 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.1,298, గరిష్ట ధర రూ.1,459 లభించింది.
● కందులు 2186 క్వింటాళ్లు రాగా.. కనిష్టంగా రూ.3,089, గరిష్టంగా రూ.7,550 పలికింది. సగటు ధర రూ.6897 నమోదైంది.
● వేరుశనగకు కనిష్ట ధర రూ.5,036, గరిష్ట ధర రూ.8,267 లభించింది.
వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కనుల పండువగా
తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: పుష్య మాసం శుక్రవారం రాత్రి ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని పల్లకీలో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితుడు కళ్యాణ చక్రవర్తి , అర్చకుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
బతికున్నా రికార్డుల్లో చంపేశారు!
ప్యాపిలి: తాను బతికి ఉన్నప్పటికీ రికార్డులో చనిపోయానని నమోదు చేయడం ఏమటని మండల కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రసూల్ ప్రశ్నించారు. ఎంపీపీ గోకుల్ లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ప్యాపిలి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రగతి నివేదికను అధికారులు సమర్పిస్తుండగా అబ్దుల్ రసూల్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే తాను వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తిని కాబట్టి జాబ్‌కార్డు తొలగించినా అభ్యంతరం లేదన్నారు. పని చేసేందుకు ఆసక్తి లేదన్న కారణాన్ని చూపిస్తూ తన కుమారుడు చాంద్‌పీరా జాబ్‌కార్డును కూడా అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు.. ఏపీఓ రవీంద్రను వివరణ కోరారు. పొరపాటు జరిగినట్లు ఏపీఓ అంగీకరించారు. ఇలాంటి పొరపాట్లు చేయడం మంచిది కాదని అధికారులను ఎంపీపీ, ఎంపీడీఓ మందలించారు.
పడిపోయిన మిర్చి ధరలు
పడిపోయిన మిర్చి ధరలు


