ఓరి నాయనో.. యూరియా లేదంట!
● టీడీపీ నేత కృత్రిమ కొరత సృష్టి
● నానో డీఏపీ కొంటేనే యూరియా
● రైతుల నుంచి అదనంగా వసూలు
యూరియా బస్తా విక్రయించినట్లు ఇచ్చిన రశీదు
రైతులకు విక్రయించిన నానో డీఏపీ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ధరలు పెంచి రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అక్రమ ఆర్జన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నానో డీఏపీ తప్పనిసరిగా కొనాలని షరతు విధిస్తున్నారు. సకాలంలో యూరియా అందక అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన హనుమంతుగుండం సొసైటీకి మార్క్‌ఫెడ్ నుంచి ఇటీవలనే 566 బస్తాల యూరియా మంజూరైంది. ఈ సొసైటీ పరిధిలో తొమ్మిది గ్రామాలున్నాయి. సొసైటీ చైర్మన్‌గా టీడీపీ నాయకుడు ఉంటంతో యూరియా బస్తాలపై సాధారణం కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. సాధారణంగా లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీలతో కలిపి రైతులకు ఒక్కో బస్తా రూ.266.50 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం రూ.290కు విక్రయిస్తున్నారు. సొసైటీ సిబ్బంది వద్దని చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ తతంగం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
‘ప్రయివేట్’గా విక్రయాలు
సొసైటీ చైర్మన్‌కు సంజామల మండలం పేరుసోములలో సొంతంగా ఫర్టిలైజర్ దుకాణం ఉంది. వాస్తవంగా సొసైటీకి నానో డీఏపీ మంజూరు కాలేదు. కానీ ఆయన మాత్రం తన దుకాణంలోని నానో డీఏపీని తీసుకొచ్చి సొసైటీ గోడౌన్‌లో పెట్టారు. యూరియా కావాలంటే కచ్చింతగా నానో డీఏపీ కొనాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు అవపరం లేక పోయినా ఒక లీటర్ నానో డీఏపీకి రూ.500 ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కొంత మంది రైతులు పది యూరియా బ్యాగులు తీసుకుంటే రెండు డీఏపీలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా పంపిణీలో సొసైటీ అధికారుల ప్రమేయం లేకుండా ప్రయివేట్‌గా ఒక వ్యక్తిని నియమించి విక్రయాలు చేయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా సొసైటీ పేరు మీదనే యూరియాతో పాటు డీఏపీకి సైతం బిల్లు రాసిస్తున్నారు. యూరియా మంజూరు నుంచి పంపిణీ వరకు వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.
ఓరి నాయనో.. యూరియా లేదంట!


