నల్లమలలో 87 పెద్ద పులులు
మహానంది: నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్య కారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారం నుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీజంతువులపై అవగాహన కల్పించేలా కేంద్రంలో చిత్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఆయన వెంట డీఎఫ్‌ఓ అనురాగ్‌మీనా, నంద్యాల, చలమ ఫారెస్టురేంజ్ అధికారులు నాసిర్‌జా, ఉదయ్‌దీప్, డీఆర్వో హైమావతి ఉన్నారు.


