చిరుత పులిని చంపి.. పులిగోర్లను విక్రయించి..
● నిందితులను అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు
బొమ్మలసత్రం: మహానంది సమీపంలోని నల్లమల్ల అడవిలో కొందరు చిరుత పులిని చంపి గోర్లను విక్రయించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఫారెస్ట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాలలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎఫ్‌వో అనురాగ్‌మీనా ఐఎఫ్‌ఎస్ తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాంటేషన్ వాచర్‌గా మహానందిలో పనిచేస్తున్నాడు. మహానంది మండలానికి చెందిన కొందరితో కలిసి విద్యుత్ వాహకాలతో అడవి పందులను చంపి వాటి మాంసాన్ని స్థానికులకు విక్రయించేవారు. ఈక్రమంలో 2023 జూన్ 8వ తేదీ అడవి పందుల కోసం ఉంచిన విద్యుత్ తీగలకు చిరుతపులి చిక్కి మృతి చెందింది. అప్పటికే చర్మం కాలిపోయి మృతి చెంది ఉన్న చిరుత 13 గోర్లను నిందితులు తొలగించి అక్కడే మృతదేహాన్ని దహనం చేశారు. ఈ కేసులో అనుమానితుగా ఉన్న ఉద్యోగిని విచారించగా మండలానికి చెందిన కొందరితో కలిసి గోర్లను విక్రయించినట్లు అంగీకరించాడు. దీంతో నంద్యాల పట్టణంలో టాటూ దుకాణం నిర్వహిస్తున్న ప్రణవ్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద మెడలో ఉన్న పులిగోరు ఉన్న బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకన్నారు. పులిగోర్లు ఇప్పటికీ ఐదు స్వాధీనం చేసుకున్నామని మరికొన్ని గోర్ల కోసం విచారణ చేపట్టామని.. విచారణ పూర్తికాగానే నిందితుల పేర్లు వివరాలు వెల్లడిస్తామన్నారు.


