ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి
● కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా
నంద్యాల: 2014 నుండి గవర్నమెంట్ అస్యూరెన్సెస్‌కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా అధికారులకు సూచించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్, సభ్యులు సంబంధిత విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ పురోగతి, గతంలో ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. చైర్మన్ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో షాదీ ఖానాల నిర్మాణం, దుల్హన్ స్కీం ప్రయోజనాల పెంపు, అర్హులకు నిధుల విడుదల, పెండింగ్‌లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అందజేయాలన్నారు. గాలేరి–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాల్లో పురోగతి మిగిలి ఉన్న పనులపై ఆరా తీస్తూ పనులు పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. కొలనుభారతి ఆలయ అభివృద్ధి పనులు, రుద్రకోడూరు ఆలయ స్థితి వివరాలు అడిగి తెలుసుకుంటూ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపల్ విభాగానికి సంబంధించి స్లాటెడ్ హౌసింగ్ కోసం అవసరమైన పట్టణాల్లో స్థలాల గుర్తింపు, కొత్త స్లాటెడ్ హౌసెస్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే జిల్లాలో అమలు కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్, ఎంవీ రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


