శ్రీగిరిలో వసతి పేరుతో ‘సైబర్’ దోపిడీ
● కర్ణాటకకు చెందిన హిందీ భక్తుడు అన్‌లైన్‌లో మల్లికార్జున సదన్‌లో వసతిగదిని పొంది డబ్బులు కూడా చెల్లించాడు. శ్రీశైలం వచ్చి చూపించగా నకిలీ వైబ్‌సైట్‌తో మోసం చేసినట్లు తేలింది.
● బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ అన్‌లైన్ ద్వారా శ్రీశైలంలో వసతి గదిని బుక్ చేసుకున్నా డు. ఏపీ టూరిజం హరిత రిసార్ట్‌కు వచ్చి బుకింగ్ పేపర్ చూపించగా అది నకిలీ అని తేలింది.
.. వీరిద్దరే కాదు శ్రీశైలం వచ్చే చాలా మంది భక్తులు సైబర్ నేరగాళ్ల మాయలోపడి మోసపోతున్నా రు. దేవస్థాన వసతి గృహాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి భక్తులను నిలువున దోపిడీ చేస్తున్నారు.
శ్రీశైలంటెంపుల్: దేవస్థాన వసతి గృహ సముదాయాల పేరుతో సైబర్ నేరగాళ్లు పలు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, గౌరీసదన్, పాతాళేశ్వరసదన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను తయారు చేశారు. వసతి గదులు బుక్ చేశామని, తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేసుకుంటూ భక్తులను మోసగిస్తున్నారు. అలాగే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరితా రిసార్ట్ పేరుతో సైతం నకిలీ వెబ్‌సైట్లను తయారు చేశారు. సైబర్ నేరగాళ్ల ఐపీ అడ్రస్ ఒకసారి ఒకచోట, మరికొన్ని నిమిషాలకు మరోచోట చూపిస్తోంది.
వసతి లేక..
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. సాధారణ రోజుల్లో 10వేల నుంచి 30వేల మంది, శని, ఆది, సోమవారాల్లో, రద్దీ రోజుల్లో 30 వేల నుంచి 50వేల మంది స్వామిని దర్శించుకుంటారు. భక్తులకు వసతి సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో వీఐపీ కాటేజీలు, మల్లికార్జునసదన్, గణేశసదన్, గంగా–గౌరీ సదన్, పాతాళేశ్వరసదన్ ఉన్నాయి. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరితా రిసార్ట్ పేరుతో హోటల్, లాడ్జి ఉంది. ఇంకా పలు ప్రైవేట్ సత్రాలు సైతం ఉన్నాయి. అయితే భక్తులకు సరిపడనంత వసతి శ్రీగిరి క్షేత్రంలో లేదు. దీంతో భక్తులు ఆన్‌లైన్‌లో నకిలీ వైబ్‌సైట్‌లకు వెళ్లి మోసపోతున్నారు.
శ్రీశైలం పీఎస్‌లో ఫిర్యాదు
ఇటీవల బెంగళూరుకు చెందిన భక్తుడు ఏపీ టూరిజం హరితా రిసార్ట్ పేరుతో వసతి గదిని బుక్ చేసుకుని మోసపోయిన ఘటనపై స్పంధించిన టూరిజం శాఖ, టూరిజం శాఖ శ్రీశైలం మేనేజర్‌తో శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నకిలీ వెబ్‌సైట్ల ముఠా దొరుకుతారో లేదో వేచిచూడాలి?
అందుబాటులోకి ఫోన్ నంబర్లు
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి శ్రీశైల దేవస్థానంలో వసతి, ఆర్జితసేవా, దర్శనం టికెట్లను పొందవద్దని శ్రీశైల దేవస్థాన అధికారులు ప్రకటనలు చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసేసమయంలో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదును వ్యక్తి ఖాతాలోకి జమ చేయమని ఎవరూ అడగబోరని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి దేవస్థాన సమాచార కేంద్రం ఫోన్ నెంబర్లు 8333901351, 52, 53లను సంప్రదించవచ్చునని దేవస్థాన అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర దేవదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్
www.aptemples.ap.gov.in
శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్‌సైట్
www.srisailadevasthanam.org
భక్తులను మోసం చేస్తున్న
సైబర్ నేరగాళ్లు
ఏపీ టూరిజం పేరుతో నకిలీ వెబ్‌సైట్
శ్రీశైలం ఒకటో పోలీసు స్టేషన్‌లో
ఫిర్యాదు


