
హంస వాహనంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం అలంకార మండపంలో హంస వాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి ఆలయ అర్చకులు, పండితులు విశేష పూజలు చేశారు. శ్రీ భ్రమరాంబాదేవిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉండి..కుడివైపున అభయహస్తాన్ని, వరముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. కాత్యాయనీ దేవిని ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం ఎదుట భాగంలో వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని అధిష్టింపజేసి విశేష పూజా కార్యక్రమాలను జరిపారు. అనంతరం కాత్యాయనీ దేవిని, హంస వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, శ్రీచక్రార్చాన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీశైలంలో నేడు
దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి, గజవాహనంపై భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.