
అపార్ ఐడీ ప్రక్రియను వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: విద్యార్థుల అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని విద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అపార్ ఐడీ ప్రగతిపై శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల విద్యా పురోగతిని పరిశీలించడానికి అపార్ ఐడీ కీలక సాధనమన్నారు. జిల్లాలో 4,801 మంది కళాశాల విద్యార్థుల ఐడీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే 57,942 మంది పాఠశాల విద్యార్థుల అపార్ ఐడీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారుల్లో 15,894 మందికి ఐడీలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, డీవీఈఓ శంకర్ నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జీఎస్‌డబ్ల్యూఎస్ కో ఆర్డినేటర్ ఖాదర్ బాషా పాల్గొన్నారు.