
దేవరగట్టు ఉత్సవాలకు శ్రీకారం
● భక్తిశ్రద్ధలతో కంకణాధారణ
● అక్టోబర్ 2న ‘బన్ని’ జైత్రయాత్ర
హొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామికి శనివారం రాత్రి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నెరణికి గ్రామంలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకీతో పాటు విగ్రహాలను గ్రామ శివారు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి గొరవయ్యలు, ఆలయ పూజారులతో దేవరగట్టుకు పంపారు. కొండకు చేరుకున్న విగ్రహాలను గిరిపై ఉన్న ఆలయంలోని కంకణకట్టపై కొలువుంచారు. సాయంత్రం ఆలయంలోని మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కంకణ కట్టపై కొలువుదీరిన మాత మాళమ్మ, మల్లేశ్వరునికి భక్తుల జయ ధ్వనుల మధ్య కంకణధారణ నిర్వహించారు. వచ్చే నెల 2న విజయదశమి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించడానికి నిశ్చయించారు. అనంతరం జైత్రయాత్ర, మరుసటి రోజు 3న దైవవాణీ(కార్ణీకం), 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

దేవరగట్టు ఉత్సవాలకు శ్రీకారం