
అప్పుల మాఫీలో లక్ష కోట్ల అవినీతి
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనలో కార్పొరేట్ దిగ్గజాలకు రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, అందులో 10 శాతం వాట దక్కించుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. అప్పుల రుణమాఫీలో గుజరాత్ మార్వాడీలే ఎక్కువగా ఉన్నారని, వారి పేర్లను ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలు కార్పొరేషన్ ద్వారా రూ.60 కోట్ల రుణాలు తీసుకుంటే కట్టాలని నోటీసులు ఇచ్చే ప్రభుత్వాలు.. బడా కార్పొరేట్లకు ఎందుకు రుణమాఫీ చేస్తున్నాయనో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతోందని, పత్రిక కార్యాలయాలు, విలేకరులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలన సజావుగా లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసమ్మతి ఉందని చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన తన సొంత నిజయోజకవర్గమైన కుప్పానికే ఏమి చేయలేదని, ఇక సొంత జిల్లా ఊసే పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.