
మోక్షదాయినీ... శ్రీ స్కందమాత...!
మహానంది: కమలవాసినీ. శ్వేతవర్ణం కలిగిన శ్రీ స్కందమాత దుర్గను ఉపాసించడం ద్వారా భవసాగరాల నుంచి విముక్తులై మోక్షం పొందుతారని మహానంది ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ స్కందమాత దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక అలంకార మండపంలో సహస్రదీపాలంకరణ, నృత్యార్చన, మహామంగళ హారతులు, కూష్మాండబలి పూజలు నిర్వహించగా స్కందమాతా...నమోస్తుతే అంటూ ప్రణమిల్లారు. కాగా వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలంకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు: దసరా సెలవుల నేపథ్యంలో యువకులు, విద్యార్థులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదకర ఘటనలు జరిగే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని గ్రామాలు, పట్టణ శివారులో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాల్వలు పూర్తిగా నిండిపోయాయని, తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. నదీ తీర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా, ఏవైనా సమస్యలు ఉంటే 112కు డయల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపదలు, అత్యవసర పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలు, ఏ సమస్య అయినా 112కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.