
ఉరిమిన వరుణుడు
ఉయ్యాలవాడ: ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్లుగా వరుణుడు ఉరిమాడు. గురువారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా మండలంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా 127.2 మి.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. పలు దారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మిరప, పత్తి, మినుము, మొక్కజొన్న, తదితర పంటలు నీట మునిగాయి. పెట్టుబడి నీటి పాలు కావడంతో రైతులు కుదేలయ్యారు. ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ, బీసీ కాలనీలో 4వ అంగన్‌వాడీ కేంద్రాన్ని వర్షపు నీరు చుట్టేసింది. ఆళ్లగడ్డ – మాయలూరు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగు వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొందరు వాహనదారులు ఆర్.పాంపల్లె మీదుగా రాకపోకలు కొనసాగించారు. హరివరం, ఉయ్యాలవాడ, బోడెమ్మనూరు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో మండలంలో పాఠశాలలకు ఎంఈఓ రఘురామిరెడ్డి సెలువు ప్రకటించారు. సర్వాయిపల్లె గ్రామ సమీపంలోని వంక ఉప్పొంగడంతో గ్రామస్తులు అవస్థలు పడ్డారు. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందూనదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో హరివరం, ఉయ్యాలవాడ, బోడెమ్మనూరు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఉయ్యాలవాడలో భారీ వర్షం
127.2 మి.మీ వర్షపాతం నమోదు
పొంగి పొర్లిన వాగులు, వంకలు
స్తంభించిన రాకపోకలు
నీట మునిగిన పంటలు

ఉరిమిన వరుణుడు