
రుణాలు తక్షణమే మంజూరు చేయాలి
● బ్యాంకర్లను ఆదేశించిన
జేసీ విష్ణు చరణ్
నంద్యాల: జిల్లాలోని రైతులకు, పొదుపు మహిళలకు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే యువకులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం రూ. 15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యమని, జూన్ 30 నాటికి రూ. 5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నారు. స్టాండప్ ఇండియా రుణాల మంజూరులో ప్రగతి అధ్వాన రీతిలో ఉందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు మినహా 57 వేల మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తిక్ , యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ నరసింహారావు, ఆర్బీఐ ఆర్‌ఎం రామకృష్ణ, కెనరా బ్యాంక్ ఆర్‌ఎం సుశాంత్ కుమార్, ఏపీజీబీ ఆర్‌ఎం వెంకటరమణ, ఎల్డీయం రవీంద్రకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు.