
కదలరు.. వదలరు!
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థాన గృహాలను పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, దేవస్థానం నుంచి ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన వారు వదలడం లేదు. దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు వసతి గృహాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దేవస్థాన అభివృద్ధికి సైతం అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా గృహాలను ఖాళీ చేయడం లేదు. దీంతో రిటైర్డ్, బదిలీ ఉద్యోగులను ఖాళీ చేయించడం దేవస్థానానికి తలనొప్పిగా మారింది.
550 గృహాలు
శ్రీశైల దేవస్థానంలో 300 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1,600 మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల కోసం దేవస్థానం వసతి గదులను నిర్మించింది. దేవస్థాన పరిధిలో సుమారు 550 గృహాలు ఉంటాయి. ఏ–టైప్, ఎంఐజీ, ఎల్‌ఐజీ పేరుతో ఆయా గృహాలను నిర్మించారు. అధికారి, సిబ్బంది హోదా మేరకు దేవస్థానం రెవెన్యూ విభాగం గృహాలను కేటాయించింది. అయితే కొంతమంది ఉద్యోగులు రిటైర్డ్ అయినప్పటికీ వారికి కేటాయించిన ఆయా గృహాలను ఖాళీ చేయడం లేదు. అంతేకాకుండా పలువురు ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఉద్యోగులు సైతం ఆయా గృహాలను ఖాళీ చేయకుండా ఉన్నారు. ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన వారిలో సుమారు 15 మందికి పైగా ఉంటారు. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వసతి గృహాలు లేక గంగాసదన్, గౌరీ సదన్‌లో భక్తులకు ఇచ్చే గృహాలను ఉద్యోగులకు కేటాయిస్తున్నారు. దేవస్థాన అధికారులు ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు స్పందించడం లేదు. గృహాలను ఖాళీ చేయడం లేదు.
క్వార్టర్స్‌లో తిష్ట వేసి..
శ్రీశైల దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహించిన సీ.మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి గత సంవత్సరం పదవీ విరమణ పొందాడు. గతంలో దేవస్థానంలో విధులు నిర్వహించేటప్పుడు ఆయనకు దేవస్థానం ఎల్‌ఐజీ నం–5 గృహాన్ని కేటాయించింది. అయన రిటైర్డ్ అయిన తరువాత దేవస్థాన గృహాన్ని ఖాళీ చేయాలి. కానీ ఇంతవరకు ఖాళీ చేయలేదు. దేవస్థానం పలుమార్లు నోటీసులు సైతం ఇచ్చింది. అలాగే ఆయన ఉంటున్న గృహాన్ని ఆయన రిటైర్డ్ అయిన తరువాత దేవస్థాన అంబులెన్స్ డ్రైవర్ రాఘవరెడ్డికి కేటాయించారు. కానీ ఆ గృహాన్ని అతను ఖాళీ చేయకుండా తిష్ట వేశాడు. ఇది ఒక రిటైర్డ్ ఉద్యోగి విషయం కాదు..ఇలా చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఉద్యోగులు, దేవస్థాన క్వార్టర్స్‌లో తిష్ట వేసి ఖాళీ చేయడం లేదు.
బదిలీ, రిటైర్డ్ అయిన ఉద్యోగులు దేవస్థాన అవసరాల దృష్యా గృహాలు ఖాళీ చేయాలి. ఒకరు ఇద్దరు ఖాళీ చేయాల్సి ఉంది. వారికి నోటీసులు పంపాం. ఖాళీ చేయని వారి గృహాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలుపుదల చేస్తాం.
– ఎం. శ్రీనివాసరావు,శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

కదలరు.. వదలరు!