
అలా వెళ్లి.. ఇలా రావడమే!
● శ్రీశైలాన్ని వదలని ఉద్యోగులు ● అపహాస్యం అవుతున్న బదిలీలు ● రెండు నెలల్లోనే తిరిగి వస్తున్న వైనం
శ్రీశైలంటెంపుల్: దేవదాయ శాఖలో బదిలీలు అపహాస్యం అవుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం బదిలీ అయిన వారు తిరిగి యథాస్థానికి వస్తున్నారు. ఇందుకు వీరికి అనారోగ్యకారణాలు, 888 జీఓ సహకరిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో శ్రీశైల దేవస్థానం నుంచి 22 మందిని, 2025లో రెండు నెలల క్రితం పది మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేసింది. వీరిలో ఇద్దరు, ముగ్గురు తప్ప చాలా మంది తిరిగి వచ్చారు. దీంతో ప్రభుత్వం బదిలీలు చేయడం ఎందుకు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బదిలీల నిబంధనలు ఇవీ..
ఐదేళ్లు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా బదిలీ చేస్తుంది. ఇందులో భాగంగా శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే పలువురు రెగ్యులర్ ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ అవుతుంటారు. దేవస్థానంలో ఆలయం, అన్నదానం, వసతి, పారిశుద్ధ్యం, గోసంరక్షణశాల, రెవెన్యూ, పరిపాలన, అకౌంట్స్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో 300 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే 1,600 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తిరిగి వచ్చారు ఇలా..
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024లో మొదటిసారి సాధారణ బదిలీలలో భాగంగా శ్రీశైల దేవస్థానం నుంచి 22 మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేశారు. మూడు నాలుగు నెలలు తిరగకముందే వివిధ కారణాలతో వీరిలో 13మంది ఉద్యోగులు తిరిగి శ్రీశైల దేవస్థానానికి వచ్చారు. అలాగే ఈ ఏడాది శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పది మంది రెగ్యులర్ ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు సాధారణ బదిలీ చేశారు. వీరిలో బి.వి.శివారెడ్డి (అసిస్టెంట్ ఇంజనీర్), కె.గిరిజామణి, సదాశివరావు, గణపతి శ్రీశైల దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ఇలా చేస్తే మేలు..
● రాష్ట్ర ప్రభుత్వం జీఓ 888 ద్వారా దేవస్థాన ఉద్యోగులను బదిలీలు చేస్తుంది. ఈ జీఓ 2000లో ఇచ్చారని, అంతకు ముందు విధుల్లో చేరిన ఉద్యోగులు ఈ జీఓ తమకు వర్తించదని కోర్టు మొట్లు ఎక్కుతున్నారు.
● ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ ఉన్నతాధికారులు 888 జీఓను సవరించాలి. ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఇతర దేవస్థానాల్లో కనీసం మూడు సంవత్సరాలైన విధులు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలి.
2024సంవత్సరంలో ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన శ్రీశైలం ఉద్యోగులను సత్కరిస్తున్న అప్పటి ఈఓ
శ్రీశైల దేవస్థాన పరిపాలనా భవనం
సిఫార్సులతో...
శ్రీశైల దేవస్థానంలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీ అయితే వెళ్లి రెండు, మూడు నెలలు విధులు నిర్వహించి సెలవుపై వస్తారు. అటు తరువాత తమకు పరిచయం ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించుకుని డిప్యూటేషన్ పై శ్రీశైల దేవస్థానానికి వస్తారు. నాలుగేళ్లే డిప్యూటేషన్‌పై ఉండి సాధారణ బదిలీలలో తిరిగి శ్రీశైల దేవస్థానానికి బదిలీ చేయించుకుంటారు. అంటే ఏ దేవస్థానానికి బదిలీ చేసినా తిరిగి శ్రీశైల దేవస్థానానికి రావడం పరిపాటిగా మారింది.

అలా వెళ్లి.. ఇలా రావడమే!