
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
● కుమార్తెను విమానం ఎక్కించి వస్తుండగా ప్రమాదం ● తెలంగాణ రాష్ట్రం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో కంటైనర్‌ను ఢీ కొట్టిన ఇన్నోవా ● ఎమ్మిగనూరు వాసి దుర్మరణం ● మృతుడి భార్య, డ్రైవర్‌కు గాయాలు
ఎమ్మిగనూరురూరల్: లండన్ వెళ్తున్న కుమార్తెను శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కించి తిరిగి వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన చిలుకూరి విజయకుమార్‌శెట్టి(66) మృతి చెందగా, అతని భార్య, వాహన డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయం సమీపంలో నివాసముండే వ్యాపారి చిలుకూరి విజయకుమార్‌శెట్టి(66), మాధవి దపంతులకు కుమారుడు నైనికాంత్, కుమార్తె నందిత ఉన్నారు. పదేళ్ల క్రితం కుమార్తె నందిత వివాహం కాగా అప్పటి నుంచి ఆమె లండన్‌లో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆమె తిరిగి లండన్ వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఈ మేరకు ఇన్నోవాను అద్దెకు తీసుకొని గురువారం రాత్రి 10 గంటలకు కుమార్తెతో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్‌లో కుమార్తె నందితను విమానం ఎక్కించారు. అనంతరం ఎమ్మిగనూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీ కొట్టడంతో ఇన్నోవా పల్టీలు కొట్టింది. కాగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా విజయకుమార్‌శెట్టి మృతి చెందగా, అతని భార్య మాధవి, డ్రైవర్ వెంకటేష్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందంచారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుమార్తె తిరిగి వస్తున్నట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గణేష్ లడ్డూ వేలంలో పాల్గొనాలని..
శుక్రవారం తెల్లవారుజామున కుమార్తెను విమానం ఎక్కించిన తర్వాత ఎమ్మిగనూరుకు బయలుదేరు ముందు ఒక గంట విశ్రాంతి తీసుకోమని విజయకుమార్‌శెట్టి డ్రైవర్ వెంకటేష్‌కు సూచించారని అతని భార్య మాధవి చెబుతోంది. అయితే ఎమ్మిగనూరులో ఈ రోజు నిమజ్జనం ఉందని, లడ్డూ వేలంలో పాల్గొనాలని, ఏమి కాదంటూ చెబుతూ డ్రైవర్ బయలుదేరాడని తెలిపింది. రాత్రంతా విశ్రాంతి లేకపోవడం, లడ్డూ వేలంలో పాల్గొనేందుకు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆమె వాపోతోంది.

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..