
నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు రద్దే!
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం పలు నిర్మాణాలు చేపడతామని కొన్ని ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థాన స్థలాలను పొందాయి. కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో శ్రీశైల దేవస్థాన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని సుమారు 25 ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తరువాత కూడా నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాన్ని రద్దు చేసి, దేవస్థానం స్వాధీనం చేసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
స్థలాలు ఇచ్చారు ఇలా..
స్థలాలు ఇవ్వాలని పలు ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థానానికి అభ్యర్థనలు పెట్టుకుంటాయి. ఆయా సంస్థల అభ్యర్థనలను పరిశీలించి వాటికి స్థలాలు కేటాయించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు అనుమతులిస్తారు. కమిషనర్ అనుమతుల మేరకు క్షేత్రంలో స్థలాన్ని దేవస్థాన ఈఓ కేటాయిస్తారు.
● ఓ ప్రముఖ సంస్థ ఆయుర్వేద వైద్యశాల, వేదపాఠశాల నిర్మాణం చేపట్టి భక్తులకు సేవలందిస్తామని ప్రతిపాదనలు పంపడంతో ఆ సంస్థకు దేవస్థానం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కాంపౌండ్ వాల్ తప్ప, ఇంతవరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు.
● ఓ ప్రముఖ మఠం వైద్యశాల, పాఠశాల నిర్మాణం చేపడతామని ముందుకు రావడంతో ఆ మఠానికి 10ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ మఠం కూడా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దేవస్థాన ఈఓ ఆ మఠం వారిని పిలిచి మాట్లాడడంతో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు.
కమిషనర్ అదేశాల మేరకు చర్యలు
దాతలు, ధార్మిక సంస్థలు తీసుకున్న స్థలాల్లో నిర్మాణాలు లేవు. కొందరు పునాదులకే పరిమితం చేశారు. అందరికి నోటీసులు జారీ చేశాం. అగ్రిమెంట్ కానీ వారికి, అగ్రిమెంట్ అయినా నిర్మాణాలు చేపట్టని వారికి అగ్రిమెంట్ రద్దు చేసేందుకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాం. కమిషనర్ అదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం.
– ఎం. శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన ఈఓ
ధార్మిక సంస్థలకు నోటీసులు

నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు రద్దే!