
ఆలయ ప్రతిష్టోత్సవాలకు రాజకీయ రంగు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. చివరకు ఆలయాలు, దేవుళ్లనూ వదిలిపెట్టని పరిస్థితి. కొలిమిగుండ్ల మండలం ఎస్.చెన్నంపల్లెలో ఆలయ ప్రతిష్టోత్సవా లు జరగకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని అనుమతివ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయనే దురుద్దేశంతో ఈ నీచానికి దిగజారారు. రెండు రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా ఆగిపోవడంతో గ్రామస్తులతో పాటు భక్తులు కూటమి నాయకుల తీరుపై మండిపడుతున్నారు. ఆలయం నిర్మాణం పూర్తి కావడంతో నెల రోజుల ముందుగానే ప్రతిష్టకు సంబంధించి వేదపండితులతో చర్చించి సాంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ముందు నుంచి వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులే ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలసికట్టుగా చేసుకోవాలని ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీ నాయకుల ఇంటింటికి వెళ్లి ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానించారు. దైవ కార్యక్రమం అనే ఆలోచన లేకుండా అధికారం మాది, మా కనుసన్నల్లో ప్రతిష్ట జరగాలనే దుర్బుద్ధితో పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిష్ట చేయకుండా అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.
కాటసాని హాజరు కాకూడదని..
ఆలయ ప్రతిష్ట ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదపండితులు మొదలుకొని షామియానాలు, అన్నదానం కోసం సర్వం సిద్ధం చేసి అడ్వాన్సులు కూడా చెల్లించారు. ఊర్లో మొదటి సారిగా కొత్త గుడి ప్రారంభం కానుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్లకు రంగులు వేసుకొని ముస్తాబు చేసుకొని బంధువులను ఆహ్వానించారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో వేడుకలకు నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. ఆలయ ప్రారంభానికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. దాతలు ఇచ్చిన విరాళాల పుస్తకాన్ని పరిశీలించి ఎక్కువ భాగం వైఎస్సార్‌సీపీ నాయకులే ఉన్నారు.. టీడీపీ నాయకులతో ఎందుకు విరాళాలు ఇప్పించుకోలేదని ప్రశ్నించారు. ఆల యం ప్రారంభం కావాలంటే కొన్ని కండీషన్‌లు విధించారు. అందులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాట సాని రామిరెడ్డి ముఖ్యంగా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాకూడదనే మెలిక పెట్టారు. గ్రామంలోని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిష్టకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చేసేదిలేక ఆలయ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. దేవుడి దగ్గర నీచ రాజకీయాలకు పాల్పడిన కూటమి నాయకులతో పాటు వారి చెప్పుచేతల్లో మెలుగుతున్న పోలీసుల వ్యవహారశైలిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిదేళ్లకు ఆలయం పూర్తి
గ్రామంలో శిథిలావస్థలో ఉన్న చిన్న చెన్నకేశవస్వామి ఆలయం తప్ప మరో ఆలయం లేదు. ఆ ఆలయంలో కూడా పెద్దగా పూజలు జరిగేవి కావు. ఊర్లో మంచి ఆలయాన్ని నిర్మించుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు భావించారు. 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీతారామాలయం నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. పెరిగిన ఖర్చులతో ఆ నిధులు సరిపడకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఆలయం మొదలు పెట్టి తొమ్మిదేళ్లు అవుతుందని భావించి త్వరగా పూర్తి చేయాలనుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇతర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులతో ఎక్కువ భాగం విరాళాలు సేకరించారు. వాటి ద్వారా త్వరగా పనులు పూర్తి చేశారు.
ఎస్.చెన్నంపల్లెలో రామాలయ నిర్మాణం
ఈనెల 29నుంచి 31 వరకు
ప్రతిష్టా కార్యక్రమాలు
వారం రోజులుగా అనుమతివ్వని
పోలీసులు
టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో
చేపట్టాలని హుకుం
మాజీ ఎమ్మెల్యే
హాజరు కాకూడదని మెలిక