నంద్యాల(వ్యవసాయం): మానసిక వికలాంగుల సంక్షేమ కోసం న్యాయ సహాయం అందించేందుకు ఎల్‌ఎస్‌యూఎం కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. నంద్యాల శివారు ప్రాంతంలోని శాంతిరాం ఆసుపత్రిలోని మానసిక వికలాంగుల విభాగాన్ని మంగళవారం ఆయన లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ మావోనియా కమిటీ సభ్యులతో కలసి తనిఖీ చేశారు. అనంతరం వార్డులోని మానసిక వికలాంగులతో కలిసి మాట్లాడుతూ వారి ఆరోగ్యాల గురించి తెలుసుకుని, న్యాయపరమైన హక్కుల గురించి వారికి తెలియజేశారు. ఆయన వెంట న్యాయవాదులు శేషసాయి, జీవన్ కుమార్, శాంతిరాం హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పీఎస్ మూర్తి తదితరులు ఉన్నారు.
రామాలయంలో ప్రతిష్టోత్సవాలకు ఏర్పాట్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎస్.చెన్నంపల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయంలో యథావిధిగా ప్రతిష్టోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులు పోలీసుల ద్వారా ఉత్సవాలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే వైనంపై ‘ఆలయ ప్రతిష్టోత్సవాలకు రాజకీయ రంగు’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో విశ్వహిందూపరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో పాటు పోలీసులు స్పందించారు. వీహెచ్‌పీ నాయకులు గ్రామంలోని ఇరువర్గాల నాయకులు, గ్రామస్తులతో వేర్వేరుగా ఆలయ ప్రతిష్టోత్సవాలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రతిష్టోత్సవాల్లో అందరూ భాగస్వాములై ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించడంతో అంగీకరించారు. గ్రామంలోని ఇరువర్గాలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గ్రామంలో చర్చించిన అంశాలను పోలీసులకు వివరించారు. విగ్రహ ప్రతిష్టోత్సవాలకు అనుమతి ఇప్పించేలా చొరవ తీసుకున్నారు. దీంతో అనుకున్న ప్రకారమే ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగనున్నాయి.
జెడ్పీ పరిధిలో బదిలీలకు 134 దరఖాస్తులు
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో బదిలీలకు అర్హులైన 134 మంది ఉద్యోగులు తమ దరఖాస్తులను అందజేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపీడీఓ, పరిపాలన అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు, లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో సర్వీస్ పూర్తి చేసుకున్న వారు 57 మంది ఉన్నారన్నారు.

న్యాయ సహాయం పొందండి