
కోటీశ్వరుడి కోడలికి జాబ్‌కార్డు
● ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుపై టీడీపీ నేత కన్ను
● సొంతూల్లో పని చేసేందుకు మొమమాటం
● పక్క ఊరిలో పని చేసినట్లు ఫొటోకు ఫోజు
● సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
● చర్చనీయాంశంగా మారిన అధికారుల తీరు
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల బరితెగింపునకు మరో నిదర్శనం ఇది. ఓ నాయకుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోడలికి ఇప్పించేందుకు చేస్తున్న లీలలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గోస్పాడు మండలం దీబగుంట్లలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ గత కొంత కాలంగా ఖాళీగా ఉంది. అయితే ఇసుకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వర్‌రెడ్డి తన కోడలికి ఈ పోస్ట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. ఇదే తడవుగా దండె కావ్య ప్రవల్లిక పేరు మీద పది రోజుల క్రితం అధికారుల సహకారంతో జాబ్‌కార్డు పుట్టించాడు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కు అర్హత సంపాదించాలంటే జాబ్ కార్డు ఉన్న వ్యక్తి 25 రోజులు కూలీలతో పాటు పనిచేసి ఉండాలి. టీడీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావటంతో దీబగుంట్లలో అప్పటికే 700 మందికి పైగా కూలీలు ఉన్న ప్రాంతానికి తన కోడలిని పనికి పంపలేకపోయాడు. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలనే తపనతో సమీపంలోని పసురపాడు గ్రామంలో కావ్య ప్రవల్లిక పనిచేస్తున్నట్లు ఫొటో తీసుకున్నారు. అక్కడి అధికారులు ఆమెను నిలబెట్టి పనిచేస్తున్నట్లు కాకుండా తానొక్కటి పనిని పరిశీలిస్తున్నట్లు ఫొటోలు దింపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు మండలంలో వైరల్ కావడంతో అక్కడి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. కోటీశ్వరుల కుటుంబ సభ్యులకు జాబ్ కార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

కోటీశ్వరుడి కోడలికి జాబ్‌కార్డు