సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం | - | Sakshi
Sakshi News home page

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

May 28 2025 6:09 PM | Updated on May 28 2025 6:09 PM

సర్కా

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

వ్యవసాయమే జీవనాధారమైన అన్నదాతకు 2024–25 ఖరీఫ్‌, రబీ సీజన్లు కలిసిరాలేదు. విత్తనం వేసినప్పటి నుంచి పంట ఉత్పత్తులు చేతికందే వరకు పడరానిపాట్లు పడ్డారు. వరి, మిరప, మొక్కజొన్న, పొగాకు సాగు చేసిన రైతులకు కష్టాలు, నష్టాలే మిగిలాయి. పైరు వివిధ దశల్లో చీడపీడలు, అధికవర్షాలు, వాతావరణం అనుకూలించక దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. అష్టకష్టాలు పడి అరకొరగా దిగుబడులు దక్కించుకున్నా మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేక దిగుబడులను దళారుల చేతిలో పెట్టి నష్టాలు మూటగట్టుకున్నారు. – కోవెలకుంట్ల
● రైతుకు కలసి రాని 2024–25 వ్యవసాయ సీజన్‌ ● వరి, మొక్కజొన్న, మిరప, పొగాకుకు దక్కని మద్దతు ధర ● కల్లం దాటని దిగుబడులు ● గగ్గోలు పెడుతున్న అన్నదాత

కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి సమీపంలో కల్లంలో రాశులుగా పోసిన వడ్లు

ఏడు ఎకరాల్లో

మొక్కజొన్న సాగు

ఎకరాకు రూ. 30 వేలు చెల్లించి ఏడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. మొదటి పంటగా మినుము సాగు చేసి రబీ సీజన్‌లో మొక్కజొన్న పంట వేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించాను. అకాల వర్షాలతో పంటంతా నేల వాలింది. కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డాను. పెట్టుబడి కూడా చేతికందలేదు.

– భూపాల్‌రెడ్డి, ఆకుమల్ల, సంజామల మండలం

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. దిగుబడి చేతికందే సమయంలో మార్కెట్‌లో పంటల ధర లు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది రబీ సీజన్‌లో కుందూ నది పరివాహకంలో ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాను. మార్కెట్‌లో బస్తా రూ. 1,300 లోపే పలు కుతోంది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా రావు.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటా రూ. 2,200 కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. – గోపాల్‌రెడ్డి, గుళ్లదూర్తి,

కోవెలకుంట్ల మండలం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడాన్ని గుర్తించి వరి, మొక్కజొన్న, జొన్న, తదితర పంట ఉత్పత్తులను కొనుగోలుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్‌ రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో వివిధ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. సాధారణ వరి ధాన్యం క్వింటా 2,300, ఏగ్రేడ్‌ రకం 2,320 ధర నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్‌లో వరికి ధర లేకపోవడంతో ఈ సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం విక్రయించాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడం లేదు. జొన్నలు క్వింటా రూ. 3,371, కంది రూ. 7,550 ప్రకారం విక్రయాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే జొన్న పంటచేత కంది రైతులు అప్పట్లోనే దిగుబడులు విక్రయించుకున్నారు. ప్రసుత్తం రైతుల వద్ద పెద్దగా జొన్న, కంది దిగుబడులు లేవు. ఈ కొనుగోలు కేంద్రాలు రైతులకంటే వ్యాపారులకు వరంగా మారాయి.

కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయానికి భరోసా లేక రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు ప్రకృతి కరుణించకా.. మరో వైపు ప్రభుత్వం ఆదుకోకా కష్టాల సాగులో నష్టాల పాలయ్యారు. ఖరీఫ్‌ వరి సాగులో ఆశించిన స్థాయిలో దిగుడులు రాక అప్పులపాలైన రైతులు ఆ నష్టాన్ని రబీ సీజన్‌లో (ఎండకారు) పూడ్చుకోవచ్చనుకుంటే చివరకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, ఎస్సార్బీసీ, కేసీకెనాల్‌, కుందూనది, పాలేరు, కుందరవాగు, తదితర సాగునీటి వనరుల ఆధారంగా రబీలో 90 వేల ఎకరాల్లో రైతులు కర్నూలు, నంద్యాల సోనా, 555, షుగర్‌లెస్‌ రకాలకు చెందిన వరి సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. అయితే ఆయకట్టుకు నీరందక, కొన్ని ప్రాంతాల్లో దోమపోటు, అగ్గి తెగులు ఆశించడంతో తెగళ్ల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు అదనంగా క్రిమి సంహారక మందులు పిచికారి చేయాల్సి వచ్చి అదనపు భారం పడింది. తీరా పైరు కోత దశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షాలు వెంటాడాయి. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. అష్టకష్టాలు పడి పంటను దక్కించుకుంటే వరి రైతును మార్కెట్‌లో గిట్టుబాటు ధర వేధిస్తోంది. బస్తా రూ. 1,250 మాత్రమే పలుకుతుండటంతో ఈ

ధరకు విక్రయిస్తే చేసిన కష్టమంతా పెట్టుబడులకే సరిపోతుందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు పైరు చేతికందే తరుణంలో రెండు, మూడుసార్లు అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు, పెనుగాలులకు వరి నేలవాలి వడ్లు రాలిపోయి నష్టపోయారు. నేలవాలిన వరిని కట్టలు కట్టి నూర్పిడి చేసేందుకు రైతులపై అదనపు భారం పడింది.

ముంచిన మిరప..

జిల్లా బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, కుందూనది, పాలేరు, కుందరవాగు, తదితర సాగునీటి వనరుల ఆధారంగా 21 వేల ఎకరాల్లో సూపర్‌–10, తేజ, డబ్బీ బ్యాడీ రకాలకు చెందిన మిరప సాగు చేశారు. మిరప నార, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీరు మళ్లింపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 2 లక్షలకు పైగా వెచ్చించారు. కౌలు రైతులకు రూ. 50 వేలు అదనపు భారం పడింది. గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో మిరపకు తెగుళ్లు ఆశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దిగుబడులు తగ్గడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా రూ. 8 వేలకు మించలేదు.

పొగాకు రైతు డీలా..

ఈ ఏడాది పొగాకు సాగులో అరకొరగా దిగుబడులు, కొనుగోలు కేంద్రాల్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు డీలా పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన పొగాకు కంపెనీలు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నట్టేట ముంచారు. రబీ సీజన్‌లో జిల్లాలో 8,374 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు రూ. 40 వేల వరకు పెట్టుబడి వెచ్చించారు. ఎకరాకు 15 క్వింటాళ్ల ఉంచి 18 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని భావిస్తే ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లలోపే దిగుబడులు పరిమితమయ్యాయి. కొన్ని పొగాకు కంపెనీలు క్వింటాకు రూ. 18,500 ధర చెల్లిస్తామని అగ్రిమెంట్‌ చేసుకుని పంట చేతికందిన తర్వాత ఆ ధరకు విక్రయించకపోవడంతో రైతుల పరి స్థితి అగమ్యగోచరంగామారింది. క్వింటా రూ. 11వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే చెల్లించి విక్రయాలు జరపడంతో రైతులు క్వింటాపై దాదాపు రూ. 6 వేలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది.

మొక్కజొన్నలో కన్నీటి దిగుబడులు

జిల్లాలో రబీ సీజన్‌లో 32,682 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూ పంలో ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించారు. పైరు నెల రోజుల దశలో ఉండగా విల్ట్‌(ఎండు తెగులు) వైరస్‌ సోకిమొక్కలు ఎండిపోయి చనిపోయాయి.ఎండు తెగులు బారి నుంచి పంటను కాపాడు కునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. తెగులు ఆశించిన పైరులో ఎకరా కు 18 నుంచి 22 క్వింటాళ్లకు మించి దిగుబడులు రా లేదు. కోత, నూర్పిడికి ఎకరాకు రూ. 2వేలకు పైగా అదనపు భారం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా రూ. 2,200 ధర పలుకుతోంది.

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం 1
1/4

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం 2
2/4

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం 3
3/4

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం 4
4/4

సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement