● భక్తులకు ఉపయోగపడని ప్రసాద్ స్కీం నిర్మాణాలు ● నిరుపయోగంగా యాంపీ థియేటర్ ● భక్తులను అలరించని సౌండ్స్ అండ్ లైట్ షో ● అలంకారప్రాయంగాశిఖరేశ్వరం వాచ్ టవర్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. కేంద్ర పర్యాటక శాఖ ‘పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్’ ప్రసాద్ పథకం కింద శ్రీశైలక్షేత్రంలో రూ.43.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ భక్తులకు అందుబాటులోకి రాలేదు. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. ముఖ్యంగా లైట్ అండ్ షోకు రూ.6కోట్లు, అదనపు ఎలక్ట్రానిక్ పరికరాలకు రూ.50 లక్షలు, ఆలయంలో ఇత్తడి క్యూలైన్ నిర్మాణానికి రూ.2.30 కోట్లు, ఆలయ విభాగంలో గోశాల వద్ద సాంస్కృతిక ప్రదర్శన శాల (యాంఫీథియేటర్) రూ.7.99 కోట్లతో మొత్తం ఆలయ విభాగంలో సుమారు రూ.17.43 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే రూ.4.38 కోట్లతో శిఖరేశ్వరం వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం, వాచ్ టవర్, పుష్కరిణి అభివృద్ధి, శిఖరేశ్వరం విద్యుద్దీకరణ, పార్కింగ్, ఇత్తడి క్యూలైన్, ఇనుప క్యూలైన్ తదితర పనులు చేపట్టారు.రూ.75.06లక్షలతో హఠకేశ్వరం వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం, రూ.35.24 లక్షలతో పంచమఠాల వద్ద విద్యుద్దీకరణ చేపట్టారు. ఆయా పనుల నిర్మాణాలు 2021లో పూర్త య్యాయి. భవనాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022 డిసెంబరు 26న ప్రారంభోత్సవం జరిగింది. నంది సర్కిల్ వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. కాగా ఆయా నిర్మాణాలు పూర్తయి భక్తులకు సేవలు అందించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ కొన్ని అందుబాటులోకి రాలేదు.
లేజర్ షో.. కనిపిస్తే ఒట్టు
శ్రీశైల ఆలయ చరిత్ర, ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, క్షేత్ర ప్రాశస్త్యం తదితర విషయాలను లేజర్ షో ద్వారా తెలుగు, ఇంగ్లీషు, కన్నడ భాషలలో భక్తులను అలరించేందుకు సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేశారు. అయితే సౌండ్ అండ్ లైట్ షో పారంభమైన కొన్ని రోజులు మాత్రమే ప్రదర్శించారు. ఆ తరువాత సుమారు ఏడాది నుంచి సౌండ్ అండ్ లైట్ షో పనిచేయడం లేదు. కేవలం సాంకేతిక సమస్య కారణంతో నిలిచిన లేజర్‌షోను ఏడాదిగా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఉత్సవాలకే పరిమితం..
ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద, గోశాలకు ఎదురుగా రూ.7.99కోట్లతో యాంపీథియేటర్ (సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన శాల) నిర్మాణం చేపట్టా రు. ఆలయానికి అరకిలోమీటర్ దూరంలో ఉంది. ఓపెన్ ఆడిటోరియం తరహాలో ఎత్తయిన కాంక్రీట్ పిల్లర్లతో నిర్మాణం చేపట్టి, గ్రానైట్ బండలతో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మధ్యలో కళాకారుల నృత్యప్రదర్శన వేదిక ఏర్పాటు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలోనే మాత్ర మే ఈ యాంపీథియేటర్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన రోజుల్లో వినియోగించడం లేదు. దీంతో రూ.7.99 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన యాంపీ థియేటర్ నిరుపయోగంగా మారాయి.
కట్టేశారు.. వదిలేశారు!