శ్రీశైలంటెంపుల్: యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవితం, మానసిక ప్రశాంతత పొందవచ్చునని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఒంగోలుకు చెందిన ప్రముఖ శిక్షకులు, యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మ ణ్యం యోగాసనాలు వేయించారు. శారీరక అసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణామాయం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలో ప్రధాన క్రియలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
గోరుకల్లు మరమ్మతులకు టెండర్లు
పాణ్యం: గోరుకల్లు జలాశయ కట్ట మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించినట్లు ఈఈ సుభకుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కట్ట కుంగిపోవడంతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దీంతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. రూ. 2.50 కోట్లతో చేపట్టే మరమ్మతు పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలంకు 7,279 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలోకి 7,279 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. సుకేసుల జలాశయం నుంచి, సెల్ఫ్ క్యాచ్‌మెంట్‌లో కురిసిన వర్షం కారణంగా ఆదివారం నుంచి సోమవారం వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. డ్యాం పరిసర ప్రాంతాల్లో 46.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో స్వల్పంగా 0.088 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 196 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రానికి జలాశయంలో 39.9680 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.80 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం కిటకిట
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. సోమవారం వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకుని, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

యోగాతో ఆరోగ్యకర జీవితం