
జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సింహభాగ
● స్టాంప్ డ్యూటీ జమ కాకుండా
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు?
● జెడ్పీకి సర్దుబాటు కాని
అపోర్షన్డ్ మొత్తం రూ.4.13 కోట్లు
● అపోర్షన్డ్ చేయని మొత్తం దాదాపు
మరో రూ.6 కోట్లు
● ప్రధాన ఆదాయ వనరుపై
దెబ్బకొట్టే యత్నం
● చిన్న పనులను కూడా చేపట్టలేని
స్థితిలో స్థానిక సంస్థలు
కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టింది. దీంతో ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ ఆయా స్థానిక సంస్థలకు జమ కావడం లేదు. జిల్లా పరిషత్‌కు స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది.
నయాపైసా ఇవ్వలేదు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ కింద నయాపైసా సర్దుబాటు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అపోర్షన్డ్ చేసిన మొత్తం రూ.4,13,63,139 నేటికి జిల్లా పరిషత్‌కు సర్దుబాటు కాలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేటికీ స్థానిక సంస్థలకు తమ వాటా ఎంత మొత్తాన్ని సర్దుబాటు చేయాలనే విషయాన్ని కూడా తెలియజేయకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దాదాపు 141 నెలలకు సంబంధించి నేటికి అపోర్షనేట్ చేయలేదు. ఈ మొత్తం కూడా దాదాపు రూ.6 కోట్ల వరకు ఉండవచ్చని జెడ్పీ పాలకవర్గం అంచనా వేస్తోంది.
చిన్న పనులు కూడా చేపట్టలేని స్థితిలో..
స్టాంప్ డ్యూటీ సర్దుబాటు కాకపోవడంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పరిధిలో చిన్న చిన్న పనులను కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాంప్ డ్యూటీ మొత్తం విడుదలైతే గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఇతరత్రా పనులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదలపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.