
ఉపాధ్యాయ బదిలీలకు వేళాయె!
కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా బదిలీలు చేసేందుకు ఇటీవలే షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయుల బదిలీల కోసం టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్–2025 ను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2023 మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారు. రెండేళ్లకు జరుగుతున్న బదిలీలకు ఆన్‌లైన్‌లో ఈ నెల 21 నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొదటగా ప్రధానోపాధ్యాయులు, ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, అనంతరం సెకండ్ గ్రేడ్ టీచర్లను బదిలీలకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
నిబంధనలు ఇవీ..
● ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లు, ఇతర కేటగిరీ టీచర్లు 8 ఏళ్ల పాటు ఒకే చోట పని చేస్తూ ఉంటే కచ్చితంగా బదిలీ కానున్నారు.
● స్టడీ లీవ్ పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులు(ఆగస్టులోపు) 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే బదిలీ కానున్నారు.
● విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ముందుగా ప్రధానోపాధ్యాయులకు దరఖాస్త్తులకు అవకాశం ఇవ్వగా, ఆ గడువు గురువారంతో ముగిసింది. స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24, ఎస్‌జీటీలకు ఈ నెల 27వ తేదితో ముగియనుంది.
● ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలు ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 24, స్కూల్ అసిస్టెంట్లకు 26,27, ఎస్‌జీటీలకు ఈ నెల 31వ తేదీన ప్రకటించనున్నారు.
● జాబితాలపై అభ్యంతరాలకు ఈ నెల 25న హెచ్‌ఎం, 28న ఎస్‌ఏ, 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎస్‌జీటీలకు అవకాశం ఇచ్చారు.
● తుది సీనియారిటీ జాబితా ఖాళీలను హెచ్‌ఎంలకు ఈ నెల 27, ఎస్‌ఏలకు 31, ఎస్‌జీటీలకు జూన్ 6వ తేదిన ప్రదర్శించనున్నారు.
● బదిలీలకు ఆప్షన్లను హెచ్‌ఎంలకు ఈ నెల 28, ఎస్‌ఏలకు జూన్ 1,2, ఎస్‌జీటీలకు జూన్ 7నుంచి 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
● హెచ్‌ఎంలకు ఈ నెల 30, ఎస్‌ఏలకు జూన్ 4, ఎస్‌జీటీలకు జూన్ 11వ తేదీన బదిలీలు ఇవ్వనున్నారు.
బదిలీలకు 8,042 పోస్టుల ఖాళీ
ఉమ్మడి కర్నూలు జిల్లాకు 15,564 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు అయ్యాయి. ఇందులో రెగ్యులర్ టీచర్లు 12,191 మంది, మినిమం టైం స్కేల్ టీచర్లు 361 మంది పని చేస్తున్నారు. డీఎస్సీ–2024 ద్వారా 2,645 మంది టీచర్లను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 16,898 మంది టీచర్ పోస్టులు అవసరం ఉంది. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన జీఓ నంబరు 21 ప్రకారం వర్కింగ్ సర్‌ప్లస్ 499, ఖాళీల సర్‌ప్లస్ 1,194 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పోస్టులు 1,334, టీచర్లు 1,701 మంది ఉండగా, వివిధ మేనేజ్‌మెంట్లలోకి 344 పోస్టులను కన్వర్ట్ చేశారు. ఎస్‌జీటీ/స్కూల్ అసిస్టెంట్ పోస్టులని అధిగమించడం ద్వారా సృష్టించిన పోస్టుల సంఖ్య 100 ఉన్నాయి. బదిలీలకు ఉమ్మడి జిల్లాలో 8,042 పోస్టులను ఖాళీగా విద్యాశాఖ చూపుతోంది. ఇందులో క్లియర్ వెకేన్సీలు 2,766 ఉండగా, 8/5 అకడమిక్ ఈయర్స్ పూర్తి చేసుకున్న వారు 2,216 మంది టీచర్లు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఫారీన్ సర్వీస్‌లు ఉన్నారు. పునఃవిభజన ఖాళీలు(రీ–అపోర్సిమెంట్ ఖాళీలు) 1,486, స్టడీ లీవ్‌లో 25 మంది, కొత్తగా మంజూరై ఖాళీలుగా 1,547 ఉండగా, మొత్తం కలిపి 8,042 పోస్టులను ఖాళీలు విద్యాశాఖ చూపించింది.
ఈ నెల 27 వరకు దరఖాస్తులకు
అవకాశం
జూన్ 11 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి
వ్యవసాయ శాఖలో..
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన బదిలీలపై కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులు పీఎల్ వరలక్ష్మి, మరళీకృష్ణ, పరిపాలన అధికారి, సూపరింటెండెంట్‌లు గురువారం సమావేశమై చర్చించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల బదిలీలు జరుగుతాయి. కొందరు ‘కూటమి’ నేతల సిపారస్సు లెటర్లు తెచ్చి కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ జూన్ 2 వతేదీన ఉత్తర్వులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.