
యోగాపై అవగాహన కల్పించాలి
నంద్యాల(న్యూటౌన్): యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో యోగా ఆంధ్రా–2025 కార్యక్రమాల నిర్వహణపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7 లక్షల మందిని యోగా ఆంధ్రా యాప్‌లో ఈ నెల 27వ తేదీలోగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 21వ తేదీ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో మే 31న, జూన్ 7న మహానందిలో, జూన్ 13న బెలూం గుహల వద్ద, జూన్ 20న పచ్చర్ల జంగిల్ క్యాంప్‌లో యోగా నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జూన్ 16వ తేదీన 5 వేల మంది విద్యార్థులతో యోగా కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి 14వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద యోగా ఆంధ్రా–2025కు సంబంధించి పోస్టర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి