
విత్తనోత్పత్తికి మంగళం
● వ్యవసాయ శాఖ ఫామ్‌లు ఉన్నా లేనట్లే
● తంగడంచె ఫామ్‌లో బీళ్లుగా
350 ఎకరాలు
● పత్తి విత్తనాలకు దళారీలే ఆధారం
● ఖరీఫ్ సీజన్ వస్తుందంటే దళారీలు,
అధికారులకు పండగే..
● ముడుపులతో తనిఖీలు నామమాత్రం
తంగడంచె ఫామ్‌లో బీడుగా మారిన భూములు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ వస్తుందంటే విత్తన సమస్య రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. విత్తనోత్పత్తికి పేరొందిన ఉమ్మడి కర్నూలు జిల్లా విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు సీజన్లకు అవసరమైన విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తోంది. నిబంధనల ప్రకారం రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయించాలి. ఆ విత్తనాలను రైతుల నుంచి సేకరించి సర్టిఫైడ్ సీడ్‌గా సరఫరా చేయాలి. అలాంటిది విత్తనాల కోసం ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖ దళారీలపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విత్తనాలను సరఫరా చేసే దళారీలకు ఏపీసీడ్స్, వ్యవసాయ శాఖలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ఆర్గనైజర్లు’. ఈ ఏడాది కూడా దళారీలు కాసుల పంట పండించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో సాగు భూములు ఉండగా ఉమ్మడి జిల్లాకు పత్తి విత్తన ప్యాకెట్లు 25 లక్షల వరకు.. ఇతర విత్తనాలు 40వేల క్వింటాళ్లు అవసరం.
దళారీలే దిక్కు
విత్తనోత్పత్తికి దేశంలోనే కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేరుశనగ, పత్తి, జొన్న, శనగ, మొక్కజొన్న, కందులు, మినుములు, కొర్రలు తదితర విత్తనాలతో పాటు కూరగాయల విత్తనోత్పత్తి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపట్టారు. నేడు కర్నూలు జిల్లాలోనే విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు కనీసం తమ ఆధ్వర్యంలోని ఆర్గనైజర్ల(దళారీలు)తో విత్తనోత్పత్తి చేయించి సబ్సిడీపై పంపిణీకి సరఫరా చేయాలి. ఆ దిశగా కూడా చర్యలు శూన్యం.
మామూళ్ల బంధం.. అంతా సవ్యం
2024–25లో సీడ్ విలేజ్ పోగ్రామ్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో వేరుశనగ క్వింటా ధర కేవలం రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. రబీలో పండిన వేరుశనగను దళారీలు ఈ ధరతో కొనుగోలు చేసి తూతూ మంత్రంగా ప్రాసెసింగ్ చేసి ఏజెన్సీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు కూడా వీటినే నాణ్యమైన విత్తనమని ధ్రువీకరిస్తూ రైతులకు పంపిణీ చేయనున్నారు. అధికారులు, ఆర్గనైజర్లకు మామూళ్ల బంధం ఉండటంతో అంతా సవ్యమే అన్నట్లు వ్యవహారం సాగుతోంది. దీంతో ఖరీఫ్ రైతులకు నాణ్యమైన విత్తనం ప్రశ్నార్థకమవుతోంది.
తనిఖీలు నామమాత్రమే..
● దళారీలు సిద్ధం చేసిన వేరుశనగను వ్యవసాయ శాఖతో పాటు ఏపీ సీడ్స్ అధికారులు తనిఖీ చేయాలి.
● అయితే ఈ ప్రక్రియ కాగితాలపై కనిపిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో జరగని పరిస్థితి.
● తనిఖీలకు వెళ్లిన వాళ్లు మామూళ్లు పుచ్చుకొని వస్తున్నట్లు తెలుస్తోంది.
● వ్యవసాయ అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
● ప్రస్తుతం విత్తనాల ప్రాసెసింగ్‌తో పాటు ప్యాకింగ్ జరుగుతోంది.
● ఈ నేపథ్యంలో విత్తనాల నాణ్యతను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది.
● ఆ దిశగా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మందగించిన విత్తనోత్పత్తి
వ్యవసాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఎదురూరు, ఎమ్మిగనూరు మండలం బనవాసి, నంద్యాల జిల్లా తంగడంచె ఫామ్‌లు ఉన్నాయి. ఎదురూరు ఫామ్‌లో 45 ఎకరాలు, బనవాసిలో 55 ఎకరాలు, తంగడంచెలో దాదాపు 600 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఎదురూరులో తూతూమంత్రంగా ఖరీఫ్‌లో కంది, రబీలో శనగ.. బనవాసి ఫామ్‌లో వరి, తంగడెంచెలో కంది విత్తనోత్పత్తి చేస్తున్నారు. తంగడంచె ఫామ్‌లో 600 ఎకరాల భూములు ఉన్నప్పటికీ 250 ఎకరాల్లోనే విత్తనోత్పత్తి జరుగుతోంది. మిగిలిన 350 ఎకరాల్లో కంపచెట్లు పేరిగి అడవిని తలపిస్తోంది. వందలాది ఎకరాల భూములు వృథాగా మిగిలిపోవడంతో కూటమి ప్రభుత్వం వీటిని ఇతర అవసరాలకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2024–25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏపీసీడ్స్ సరఫరా చేసిన వేరుశనగలో రాళ్లు, మట్టిపెళ్లలు ఉండటం, విత్తనాలు నాసి రకం, పుచ్చులు ఉండటంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈసారైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటే ఆ ఊసే కరువైంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాల కోసం వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ దళారీలపైనే ఆధారపడటం గమనార్హం.
వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ విత్తనోత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తేనే రైతులకు నాణ్యమైన వేరుశనగ లభిస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అయితే దళారీలు ఇచ్చే కమీషన్‌లు పైనుంచి కింది స్థాయి వరకు ఉండటంతో విత్తనోత్పత్తి అటకెక్కినట్లు చర్చ జరుగుతోంది.

విత్తనోత్పత్తికి మంగళం