
మృత్యువు మింగేసింది!
● పొలంలోని నీటి తొట్టిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
గోనెగండ్ల: పొలంలో నీటి తొట్టిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన గోనెగండ్లలో శుక్రవారం చోటు చేసు కుంది. స్థానిక కురువ పేటకు చెందిన బోయ మందకల్, సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కూతురు మాధురి(12) ఆరవ తరగతి వరకు చదివి మధ్యలో బడి మానేసింది. అలాగే అదే కాలనీకి చెందిన బోయ రంగప్ప నాయు డు, మహేశ్వరి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి రెండో కుమార్తె మంజుల (12) కూడా బడి మానేసింది. రోజు మాదిరిగా సరస్వతి, మహేశ్వరి శుక్రవారం ఓ రైతు పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్తుండగా వారి బిడ్డలు మాధురి, మంజుల కూడా వెంట వెళ్లారు. తల్లులు పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా మధ్యాహ్న సమయంలో ఆ చిన్నారులు ఇద్దరు పొలంలోని నీటి తొట్టి దగ్గరకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి పోయారు. కొద్ది సేపటి తర్వాత పిల్లలు కనిపించక పోవడంతో అనుమానంతో నీటి తొట్టిలో చూడగా ఇద్దరు విగతజీవులుగా కనిపించడంతో గుండెలు బాదుకున్నారు. కుమార్తెల మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృత్యువు మింగేసింది!