
భ్రమరాంబాదేవికి ఊయలసేవ
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల భ్రమరాంబాదేవికి దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన సేవలో భాగంగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ముందుగా సేవా సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి షోడశోపచార పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్రనామ పూజలు జరిపించారు. అలాగే శ్రీశైల గ్రామ దేవతగా పిలవబడుతున్న అంకాలమ్మ అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు.
కొనసాగుతున్నపది సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 632 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2,657 మంది విద్యార్థులకు గాను 2025 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి. ఓపెన్ టెన్త్ పరీక్షల్లో భాగంగా సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షకు నాలుగు కేంద్రాల్లో 214 మంది విద్యార్థులకు గాను 188 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం పరీక్షలు రెండు కేంద్రాల్లో 115 మంది విద్యార్థులకు గాను 105 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు.
కోడుమూరుకు చేరిన జీడీపీ నీరు
కోడుమూరు రూరల్: పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నీరు శుక్రవారం కోడుమూరు వద్ద హంద్రీకి చేరుకున్నాయి. హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి జీడీపీ ఎడమ కాల్వ ద్వారా 40క్యూసెక్కుల చొప్పున వర్కూరు సుద్ధవాగు మీదుగా గత మూడు రోజుల నుంచి కోడుమూరు హంద్రీనదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు నీరు వదిలితే పూర్తిస్థాయిలో మంచినీటి పథకాలకు చేరుకుంటాయని కోడుమూరు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు.