
‘పీఎంశ్రీ’ పనులు వేగవంతం చేయండి
నంద్యాల(న్యూటౌన్): పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద జిల్లాలో 40 పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలపై ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత కింద 28 పాఠశాలలు, రెండో విడత కింద 12 పాఠశాలల్లో రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఆర్‌ఓ ప్లాంట్లు, కిచెన్ గార్డెన్స్ తదితర 144 పనులు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో 28 పాఠశాలల్లో ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు జూన్ 6వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. కిచెన్ గార్డెన్స్‌కు సంబంధించి ఫెన్సింగ్ పూర్తయిందని విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్ కమిటీ వారిని సమన్వయం చేసుకుంటూ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏసీపీ ప్రేమాంత్ కుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజకుమారి