
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటమద్దులు, మహమ్మద్ గౌస్, సీపీఎం పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు విమర్శించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని సీపీఎం కార్యాలయం నుంచి ఎండీయూ వాహనాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓ రామునాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖాజా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ఎండీయూ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎండీయూ వాహనాలకు కాల పరిమితి ఉన్నా జూన్ 1వ తేదీ నుంచి ఎండీయూ ఆపరేటర్లను తొలగిస్తున్నామని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఎండీయూ ఆపరేటర్లు 9,260 మంది ఉన్నారని, కూటమి ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎండీయూ వాహనాలను కొనసా గించాలని, లేని పక్షంలో ఎండీయూ వాహన ఆపరేటర్లతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడిస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థలను నాశనం చేస్తుందని వారు విరమ్శించారు. ఇప్పటికే 3 లక్షల మంది వలంటీర్లను, మద్యం దుకాణంలో పని చేసే 30వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికే సాగనంపిందన్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలను ఉన్న ఉద్యోగాలను తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను మోసగించడం తప్ప కూట మి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతుందన్నారు. సీఐటీయూ నాయకులు, ఎండీయూ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ
నిలిపివేత దారుణం

ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం