
కండువాలు కప్పి.. ప్రజాతీర్పునకు మసిపూసి!
నందికొట్కూరు: కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్న టీడీపీ.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ కుర్చీతో రాజకీయ చదరంగం ఆడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాలు కౌన్సిలర్లతో రాయ‘బేరాలు’ నడుపుతూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారు. టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తమ రాజకీయ ఉనికి కోసం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ గిరిని వేదికగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్న ఎంపీ వర్గీయుడు దాసి సుధాకర్‌రెడ్డిపై మాండ్ర వర్గం అవిశ్యాస తీర్మానం పెట్టింది. ఈ మేరకు అధికారులు గురువారం తీర్మానం ప్రవేశపెడుతుండటంతో ఇరువర్గాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. మొత్తం 29 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 21 గెలుచుకుంది. ఏడుగురు ఇండిపెండెంట్లు వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో వారి బలం 28కి చేరింది. టీడీపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 15 మంది కౌన్సిలర్లకు పచ్చ కండువా కప్పారు. మాండ్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మిగిలిన కౌన్సిలర్లు చైర్మన్‌తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో చేరారు. ప్రస్తుతం ముగ్గురు కౌన్సిలర్లు మంగళి అల్లూరి కృష్ణ, చెరుకు సురేష్, షేక్ నాయబ్ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతూ కీలకంగా మారారు.
మాండ్ర, ఎంపీ క్యాంప్ రాజకీయాలు
నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లతో మంతనాలు మొదలు పెట్టి కొంత మేరకు సఫలం అయినట్లు సమాచారం. మాండ్ర వర్గంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు సైకిలెక్కి తిరుగుతుండగా ముగ్గురు వైఎస్సార్‌సీపీ జెండాను వీడేది లేదని తేల్చి చెప్పారు. ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో 10 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. కోరం లేకపోయినా మాండ్ర వర్గం అవిశ్వాసానికి తెరలేపారు. ఇరువర్గాలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఎంపీ వర్గం ఊటికి, మాండ్ర వర్గం గోవాకు కౌన్సిలర్లను తరలించారు. చైర్మన్‌గిరి కోసం ఎంపీ వర్గంలోని మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్లను మెజార్టీ కోసం కొనుగోలు చేసేందుకు మాండ్ర సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలో చైర్మన్ కుర్చీ ఎవరినీ వరిస్తుందో వేచి చూడాల్సిందే.
మున్సిపాలిటీలో టీడీపీకి ఒకే కౌన్సిలర్
మారిన రాజకీయాలతో
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు కండువాలు
నేడు నందికొట్కూరు
మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
పట్టు నిలుపుకునేందుకు ఎంపీ,
పైచేయి సాధించేందుకు
మాండ్ర యత్నం
చర్చనీయాంశంగా మారిన
నీచ రాజకీయాలు
ఏర్పాట్లు పరిశీలన
మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డిపై గురువారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాట్లను ఆర్డీఓ నాగజ్యోతి బుధవారం పరిశీలించారు. కాగా అవిశ్వాస తీర్మానం విధి విధానాల గురించి విలేకరుల కోరగా కమిషనర్ బేబీ చెబుతారని వెళ్లిపోయారు. అయితే అవిశ్వాస తీర్మానం కార్యక్రమం కవరేజీకి పాత్రికేయులు రానీయవద్దని టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి కమిషనర్ సూచించడం ఎంత వరకు సమంజసమని జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కండువాలు కప్పి.. ప్రజాతీర్పునకు మసిపూసి!