
రహదారిపై ‘పచ్చ’ కక్ష
● డ్రెయినేజీ ఉన్నా కాల్వపేరుతో
తవ్వకాలు
● మట్టిని తవ్వి రోడ్డుపై వేసి
రాకపోకలకు అడ్డంకి
● వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులంటూ
కక్ష సాధింపు
● అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోని వైనం
కోవెలకుంట్ల: కూటమి నేతల రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. కంపమల్ల గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల తీరుతో బీసీ కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు ఎదురయ్యా యి. కాలనీలో 75 కుటుంబాలు జీవనం సాగిస్తున్నా యి. ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులున్నారనే దురుద్దేశంతో కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు తెచ్చిపెట్టారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రూ. 1.30 లక్షలతో గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించి 150 మీటర్ల మేర కాలనీలో డ్రెయినేజీ ఏర్పాటు చేశారు. ఈ రహదారి వెంటే గ్రామానికి చెందిన రైతు లు, కాలనీ ప్రజలు పొలాలు, ఊరకుంట, మెయిన్ రోడ్డుకు వెళుతున్నారు. డ్రెయినేజీ ఉన్నా ఆరు నెలల క్రితం టీడీపీ నాయకులు ఆ డ్రెయిన్ పక్కనే ప్రొక్లెయిన్‌తో కాల్వ పేరుతో తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని రోడ్డుపైనే కుప్పలుగా పోయడంతో రహదారిలో రాకపోకలు స్తంభించి పోయాయి. ఆరు నెలలు గడిచినా రోడ్డుపై మట్టిని తొలగించకపోవడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ సోముల లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రామ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆ కుటుంబ సభ్యుల వాహనాలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కాల్వ పేరుతో మట్టిని తవ్వి ఇంటి ముందు అడ్డంగా పోశారు. మట్టి కట్టలు ఉండటంతో ఆరు నెలల నుంచి లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వాహనాల్లో బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. రోడ్డుపై మట్టి వేసి రాకపోకలకు అంతరాయం కల్గించిన విషయాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అంతటితో ఆగక టీడీపీ నేతలు లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని అంతమొందించేందుకు కుట్రలు పన్ని ఈ ఏడాది మార్చి 12వ తేదీన హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకుల దాడిలో లోకేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి, సోదరుడు వెంకటేశ్వరరెడ్డి గాయాలపాలయ్యారు. దాడి కుట్రలో భాగంగానే ప్రణాళికాబద్ధంగా ఇంటి చుట్టూ మట్టికట్టలు వేసినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టికట్టలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

రహదారిపై ‘పచ్చ’ కక్ష