
ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్‌కు బుధవారం గుంతకల్లుకు చెందిన వంకదారి రామకృష్ణయ్య రూ.5 లక్షల విరాళాన్ని దేవస్థాన ఏఈవో జి.స్వాములకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికను అందించి సత్కరించారు.
టీబీ డ్యామ్‌కు
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అకాల వర్షాలతో అడపాదడపా జలాశయానికి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం డ్యామ్‌లో 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ఇన్‌ఫ్లో 2,950 క్యూసెక్కులుంది. గత నెల 24న ఇన్‌ఫ్లో జీరో ఉండి 6.871 టీఎంసీల నీరు ఉండగా.. అకాల వర్షాలతో రెండు వారాలుగా వరద నీటి చేరిక మొదలై బుధవారానికి 7.5 టీఎంసీలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 1577.79 అడుగుల వద్ద 3.489 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాలు ఆశాజనకంగా కురిస్తే జూలై నెలాఖరుకు డ్యాం పూర్తి మట్టానికి నీరు చేరి ఎల్లెల్సీతో పాటు వివిధ కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
రోడ్డు ప్రమాదంలో
ఎస్‌ఐకి గాయాలు
కర్నూలు: కర్నూలు శివారు డోన్ రోడ్డులో మిస్టర్ ఇడ్లీ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ ఎస్‌ఐ శ్రీనివాసులుతో పాటు ఆయన కూతురికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఎస్‌ఐ కుటుంబ సభ్యులతో కలసి నడుచుకుంటూ వెళ్తుండగా దొర్నిపాడు పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కారులో వెళ్తూ ఎస్‌ఐ శ్రీనివాసులును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తప్పించే క్రమంలో కూతురికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
8 నుంచి ఆర్‌యూ
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఈనెల 8 నుంచి జూన్ 3వ తేదీ వరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్, ఐడీ కార్డుతో పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలన్నారు.