
పైసాచికం
ఇసు‘కాసు’రులు
బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలో అక్కజమ్మ చెరువులో మట్టిని తరలిస్తున్న దృశ్యం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అక్రమాలు పెచ్చుమీరాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి సైతం దోపిడీ చేస్తున్నారు. వీరికి అధికారులు అండగా ఉంటూ ‘పక్ష’ పాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. ఒక వైపు టీడీపీ నాయకుల పైశాచికాన్ని చూస్తూ.. మరో వైపు అధికారులు నిశ్చలంగా ఉండటాన్ని గమనిస్తూ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఽటీడీపీ నాయకులు ఇసుక, మట్టి, గ్రా వెల్ తవ్వకాలు జరుపుతున్నారు.వీరి అక్రమాలకు కొందరు అధికారులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనది తీరంలో ఇసుక,నదిఒడ్డున ఏర్పాటు చేసిన కరకట్టను సైతం వదలకుండా టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు.
బెలుకు.. అవినీతి పలుకు!
కుందూనది విస్తరణ పనుల్లో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నది ఒడ్డున కరకట్ట ఏర్పాటు చేశారు. వర్షాకాలంతో నదికి వరద నీరు అధికంగా చేరినా తీర గ్రామాలు, పొలాలను ముంచెత్తకుండా ఈ కరకట్ట అడ్డుకట్ట వేసింది. అయితే టీడీపీ నేతలు కరకట్టను సైతం వదలకుండా తవ్వకాలు జరిపి బెలుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని కట్టను తవ్వి యథేచ్ఛగా బెలుకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ బెలుకును రూ. 500 నుంచి రూ. 800 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రతి రోజు పెద్ద ఎత్తున బెలుకు తరలిపోవడంతో కరకట్ట బలహీన పడింది. వర్షాకాలంలో నదికి వరదనీరు చేరితే పంటపొలాలు, గ్రామాల్లోకి వరదనీరు చేరే ఆస్కారం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చెరువులో మట్టి దందా
బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలోని అక్కజమ్మ చెరువులో టీడీపీ నేత అక్రమ మట్టిదందా కొనసాగిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేత అండదండలతో మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. చెరువు నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిపోస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారు.
కక్ష సాధింపు ఇలా..
వైస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారులను బెదిరించి తనిఖీలు, దాడులు చేయిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవెలకుంట్ల మండలం జోళదరాశిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉప్పరి సుబ్బరాయుడు తన సొంత పొలంలోని మట్టిని మరో పొలానికి తరలించుకునేందుకు ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన మరుక్షణమే తహసీల్దార్ తమ సిబ్బందితో హుటాహుటినా అక్కడికి చేరుకుని మట్టిని తరలించవద్దని హుకూం జారీ చేశారు. నిబంధనల ప్రకారం తన సొంత పొలంలోని మట్టిని మరొక పొలా న్ని చదును చేసేందుకు తోలుకుంటున్నానని చెప్పినా వినకుండా అడ్డుకున్నారు. టీడీపీ పెద్దల ఆదేశాలతో ప్రొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ శాఖ అధికారులు వాహనాలకు రూ.25 వేలు జరిమానా విధించా రు.అంతటితో కక్ష సాధింపు ఆగలేదు. జరిమానా చెల్లి ంచి రిలీజ్ కాపీని సమర్పించినా తిరిగి ఆర్టీఓ అధికారులకు మరో రిపోర్టు పంపించారు. వాహనాలకు సరై న రికార్డులు లేవని ఆర్టీఓ అధికారులు రూ. 19, 500 జరిమానా విధించడంతో ఆమొత్తాన్ని చెల్లించి వాహనాలను రిలీజ్ చేయించోవాల్సి వచ్చింది. టీడీపీ నాయకుల కొమ్ముకాస్తూ అధికారులు పచ్చపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
విమర్శలు ఇవీ..
కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక, బెలుకును ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు సొంతపొలాల్లోని మట్టిని తోలుకుంటున్నట్లు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకుని కేసులు పెడుతున్నారు. కళ్లెదుటే ఇసుక, మట్టి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిపోతున్నా రెవెన్యూ అధికారులు కాని, కేసీ కెనాల్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇసుకను తరలిస్తున్న టీడీపీ నాయకులు
చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
సహజ వనరులను కొల్లగొడుతున్న వైనం
అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికారులు
వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
కుందూతీరంలో ఇసుకను ట్రిప్పు రూ. వెయ్యి నుంచి రూ. 1,200, మట్టిని రూ. 500 నుంచి 600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చినా టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రైతులు, ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసుకోవచ్చు అన్న నిబంధనను తుంగలో తొక్కి ఇసుక తువ్వను సైతం విక్రయిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో కుందూతీరంలో ఇసుకను తవ్వుతుండటంతో తీరం వెంట పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం నది ఉప్పొంగితే ఈ గుంతల్లో భారీగా నీరు చేరే అవకాశం ఉంది. ప్రజలు అందులో పడితే తమ విలువైన ప్రాణాలను కోల్పోవచ్చు. జిల్లా అధికారు లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
బనగానపల్లె నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా కుందూ నదిలోని, కుంటల్లోని, చెరువుల్లోని ఇసుక, మట్టిని టీడీపీ నాయ కులు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం సొంత పొలాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మట్టిని తోలుకుంటే అడ్డుకుని కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
– కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె

పైసాచికం

పైసాచికం